● మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
విజయనగరం అర్బన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. పీఎస్‌ఆర్‌ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూల్యాంకన కేంద్రాన్ని ఆయన సోమవారం తనిఖీచేశారు. వివిధ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను టీచర్ల టేబుళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. మూల్యాంకనంలో పాల్గొంటున్న అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈలు), స్పెషల్ అసిస్టెంట్లు, చీఫ్ ఎగ్జామినర్ల పనితీరును సమీక్షించారు. మూల్యాంకన కేంద్రంలో మౌలిక వసతులు, భద్రతా చర్యలు, రికార్డు నిర్వహణలో ఎలాంటి లోపాటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట రాష్ట్ర పరిశీలకులు తహేరా సుల్తానా, జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు, విద్యాశాఖ అధికారులు, క్యాంప్ అధికారులు ఉన్నారు.
జేఎన్‌టీయూ జీవీలో జలసంరక్షణ చర్యలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాల సాధనలో భాగంగా జలసంరక్షణ కార్యక్రమాన్ని జేఎన్‌టీయూ జీవీలో సోమవారం వీసీ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు ప్రారంభించారు. ఉత్తరాంధ్రలో నీటిలభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో నీటి వనరులను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. వర్సిటీలో భవనాలపై పడే వర్షపు నీటిని నిల్వ చేయడం, ఇంకుడు గుంతలు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి చర్యలు చేపడతామన్నారు. వర్సిటీ ప్రాంగణంలో నీటినిల్వకు గుంతులు తీయించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్, డైరెక్టర్లు, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
నీటి సంరక్షణకే ‘జలధార’
పూసపాటిరేగ: జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన జలధార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాంసుందరరెడ్డి అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలం చెరువుకొమ్ము గొల్లపేట గ్రామంలోని రాజుచెరువు వద్ద కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాఉడతూ జిల్లాలో నీటి భద్రతను సాధించడంలో సాగునీటి సంఘాల పాత్ర కీలకమన్నారు. ఈ నెల 15వ తేదీ వరకు జిల్లాలో చేపట్టవలసిన పనులు ప్రాధా న్యత క్రమంలో గుర్తించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు, నార్త్‌కోస్టు చీఫ్ ఇంజినీర్ ఎస్.స్వర్ణకుమార్, ఇరిగేషన్ ఈఈ ఎం.వి.రమణ, డీఈఈ ఎం.గోవిందరావు, ఎంపీడీఓ స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో గుణుపూరుపేట వాసుల ఆందోళన
డెంకాడ: వీఎంఆర్‌డీఏ రోడ్డు అలైన్‌మెంట్‌ను డెంకాడ మండలం గుణుపూరుపేట గ్రామ పరిధిలోని నివాస గృహాలకు ఇబ్బంది లేకుండా ఇవ్వాలంటూ విశాఖలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం వద్ద గ్రామస్తులు సోమవారం ఆందోళన చేశారు. గ్రామంలోని యాతపేట, బీసీ కాలనీ మీదుగా మొదటి అలైన్‌మెంట్ రోడ్డు వెళ్తే పేద కుటుంబాలు నిరాశ్రయులుగా మారుతారన్నారు. కొందరు రియల్ వ్యాపారులు తమ భూములను కాపాడుకునేందుకు పేదల ఇళ్లపై నుంచి రోడ్డు నిర్మించేందుకు పట్టుబడుతున్నారని వీఎంఆర్‌డీఏ చైర్మన్ వి.ప్రణవ్‌గోపాల్, అధికారులకు గోడు వినిపించారు.


