విజయనగరం అర్బన్: పేద కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు దాతల నుంచి నేరుగా సహకారం అందించి పేదరికాన్ని నిర్మూలిస్తామని ప్రకటించి అమలు చేస్తున్న పీ 4 (జీరో పావర్టీ) కార్యక్రమం ఫలితాలు క్షేత్ర స్థాయిలో భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం చూపుతున్న దిశ, వాస్తవ ఫలితాలు మధ్య భారీ అంతరం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీ 4 ద్వారా వచ్చిన దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగిస్తూ పథకం లక్ష్యాన్ని దారి మళ్లిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పీ 4 వార్షికోత్సవంలో అలాంటి దాతలను ఉత్తమ మార్గదర్శకులుగా మంత్రి వంగలపూడి అనిత ప్రశంసించి సత్కరించడం కనిపించింది. జిల్లా, నియోజకవర్గ స్థాయి అవార్డుల వివరాలు చూస్తే ఈ కార్యక్రమం ప్రధానంగా విరాళాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంపై ఆధారపడుతున్నదన్న విషయం స్పష్టమవుతోంది.
స్వచ్ఛంద సంస్థ విరాళాలే అధికం
గజపతినగరం నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ ఇండియా ఫౌండేషన్ రూ.71.61 లక్షలతో పాఠశాల, ఆస్పత్రికి సదుపాయాలు కల్పించగా, మరో సంస్థ రూ.39.10 లక్షలతో మార్కెట్, పాఠశాలలు, గ్రామాలకు సహాయం చేసింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.12.64 లక్షలు, పుష్పగిరి ఫౌండేషన్ రూ.4లక్షలతో సేవలు అందించాయి. ఇవి చూస్తే ప్రభుత్వం బాధ్యతగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు దాతల ఆర్థిక సహాయాన్ని వినియోగించి పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని పక్కన పెట్టిందని విశ్లేషకులు ఆక్షేపిస్తున్నారు.
లక్ష్యానికి తగ్గ విస్తృతి లేకపోవడం
పీ–4 లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా పేదరిక నిర్మూలనే అయినప్పటికీ అమలు మాత్రం కొన్ని నియోజనవర్గాలు, కొన్ని సంస్థలకే పరిమితమవుతోంది. జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా కేవలం 19,410 కుటుంబాలు మాత్రమే దత్తత పొందాయి. అంటే దాదాపు 75 శాతం కుటుంబాలు ఇంకా సహాయానికి దూరంగానే ఉన్నాయి. వీళ్లలో కొంతమంది 27 గ్రామాలను దత్తత తీసుకున్నట్టు ప్రకటించినా వాటి సహాయ కార్యక్రమాలు ఆయా గ్రామాలకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లాలో లక్షలాది మంది పేదలు ఉన్న నేపథ్యంలో లక్షల్లో విరాళాలు ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. పైగా 2,897 మార్గదర్శులు మాత్రమే ముందుకు రావడం, కార్యక్రమంపై దాతలకు నమ్మకం లేదనే విషయం స్పష్టమవుతోంది.
పీ–4తో బాధ్యతల నుంచి దూరంగా ప్రభుత్వం
లక్షల్లో బంగారు కుటుంబాలు..
ప్రకటించింది 82,426
27 గ్రామాలను దత్తత తీసుకున్నా..
కనిపించని సహాయక పనులు
ప్రభుత్వ పాత్రపై ప్రశ్నలు – ప్రచారం
– వాస్తవం
పీ–4లో ప్రభుత్వం మార్గదర్శక పాత్రలో మాత్రమే ఉండి అమలు బాధ్యతను స్వచ్ఛంద సంస్థలు, దాతలపై మళ్లిస్తున్నదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలన వంటి కీలక అంశంలో ప్రభుత్వ ప్రత్యక్ష పెట్టుబడి పర్యవేక్షణ లేకపోవడం మేధావుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేస్తున్నప్పటికీ అందులో భాగంగా అందిస్తున్న సహాయం పరిమిత స్థాయిలోనే ఉండటమే కాకుండా పేదరిక నిర్మూలనకు వినియోగించడం లేదని విమర్శలు వస్తున్నాయి. చివరకు ఇది ఒక ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయేలా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


