సీతంపేట: స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కన పడి ఉన్న జల్‌జీవన్ మిషన్ పైపులు దగ్ధమయ్యాయి. ఇంటింటికి కుళాయి కనెక్షన్‌లు వేయడానికి సంబంధిత కాంట్రాక్టర్ 37 కిలోమీటర్ల పొడవు గల పైపులు గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ ఆలయానికి కొద్ది దూరంలో ఉంచేశారు. గురువారం అకస్మాతుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక శాఖాధికారి జామి సర్వేశ్వరరావు అగ్నిమాపక శకటంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంపై ఆరా తీశారు.
గవరమ్మపేటలో గజరాజులు
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట, రామినాయుడువలస పంట పొలాల్లో గజరాజులు గురువారం దర్శనమిచ్చాయి. ఉదయం గవరమ్మపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గజరాజులు మధ్యాహ్నానానికి రామినాయుడువలస, పెదమేరంగి చెరువులోకి చేరుకున్నాయి. రాత్రి సమయంలో గ్రామంలోకి చొచ్చుకువస్తాయని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రబీ వరి పంట పొట్ట దశలో ఉండడంతో పంటలను పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హెల్ప్ డెస్క్‌ను
ప్రారంభించిన ఎస్పీ
గుర్ల: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్మించిన ఉమెన్ హెల్ప్ డెస్క్, పార్కింగ్ షెడ్, ఫిర్యాదుదారులు వేచి ఉండే గదిని ఎస్పీ దామోదర్ గురువారం ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులపై దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గదిని నిర్మించడంతో సంతోషం వ్యక్తం చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, ఎస్‌ఐ నారాయణరావు పాల్గొన్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
మెంటాడ: మండలంలోని మెంటాడ గ్రామంలో మండలవారి వీధిలో మండల సత్యవతి పెంకుటిల్లు గురువారం దగ్ధమైంది. సత్యవతి ఇంట్లో నుంచి పొగలు రావడం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. పెంకుటిల్లు కావడంతో కలపకు మంటలు అంటుకొని భారీగా మంటలు చెలరేగి కాలిపోయింది. ప్రమాదంలో తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులు, బట్టలు, నిత్యావసర సరుకులతో పాటు రూ.76 వేల నగదు, మూడు తులాల బంగారు ఆభరణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు సత్యవతి తెలిపారు.
విజయనగరం అర్బన్: డీఎల్‌ఎడ్ కోర్సులకు సంబంధించిన పరీక్ష ఫీజుల చెల్లింపుల షెడ్యూల్‌ను డీఈఓ యు.మాణిక్యంనాయుడు గురువారం విడుదల చేశారు. 2024 – 26 బ్యాచ్‌తో పాటు ఒకసారి ఫెయిల్ అయిన 2022 – 24, 2023 – 25 బ్యాచ్‌ల విద్యార్థులకు ఈ షెడ్యూల్ వర్తిస్తుంది. పరీక్ష ఫీజులను నిర్ణీత గడువులోపు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపులు వెబ్‌సైట్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. ఫీజు చెల్లింపునకు రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 5వ తేదీ వరకు విద్యార్థులకు అవకాశం ఉంది. అదే ప్రిన్సిపాల్ ద్వారా చెల్లించవలసిన వారికి మాత్రం ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. విద్యార్థులు ముందుగా ఫీజులను ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వే ద్వారా చెల్లించి, అనంతరం అవసరమైన వివరాలను సంబంధిత కళాశాలలకు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజులు నాలుగు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.


