పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బైపాస్ కాలనీలో భారత్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. స్థానిక భారత్ పెట్రోల్ బంకు వద్ద ఉదయం 11 గంటల నుంచే వినియోగదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. సాయంత్రం వరకు వాహనం రాకపోవడంతో ఎండలోనే పడిగాపులు కాశారు. చివరకు సాయంత్రం వేళ సాలూరు నుంచి ఒక బొలెరో, ఆటోలో అరకొరగా సిలిండర్లు చేరుకున్నాయి. వినియోగదారులు ఒక్కసారిగా ఎగబడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి పంపిణీని క్రమబద్ధీకరించారు. భారీ క్యూ ఉండటం, స్టాక్ తక్కువగా రావడంతో తమ వరకు గ్యాస్ అందుతుందో లేదోనని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.


