విజయనగరం టౌన్: ప్రముఖ నేపథ్యగాయని ఎస్.జానకమ్మ ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లిని బుధవారం దర్శించుకున్నారు. మూ డులాంతర్లు జంక్షన్ వద్దనున్న బాలాలయంలో అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించిన అనంతరం జానకమ్మకు వేదాశీస్సులు, అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గురునారాయణ కళాపీఠం వ్యవస్థాపకుడు బీఏ నారాయణ, డాక్టర్ జి.సన్యాసమ్మ, గాయనీ, గాయకులు పాల్గొన్నారు.
తల్లిదండ్రుల చెంతకు బాలిక
విజయనగరం క్రైమ్: వన్‌టౌన్ స్టేషన్ పరిధి తోటపాలెంలో అదృశ్యమైన బాలిక కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఎస్సై లీలావతి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 31న తోటపాలెంనకు చెందిన ఓ బాలిక అదృశ్యమైందంటూ తండ్రి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ చౌదరి ఆదేశాలతో ఎస్సై లీలావతి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేయగా విశాఖపట్నం వెళ్లినట్లు గుర్తించారు. దీంతో హుటాహుటిన ఎస్సై లీలావతి తన బృందంతో విశాఖ వెళ్లి బాలికను తీసుకొచ్చి కన్నవారికి బుధవారం అప్పగించారు. బాలిక ప్రేమికుడితో వెళ్లినట్లు తేలడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో హెచ్‌సీ రామారావు, తదితరులు పాల్గొన్నారు.


