గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు కోల్పోయాడని జెడ్పీటీసీ గార తవుడు, సర్పంచ్ బెల్లాన త్రినాధరావు ధ్వజమెత్తారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏడుకొండలు జాతీయ రహదారి మెయిన్‌రోడ్డులో ఉన్న డివైడర్‌ను దాటుకుంటూ వెళ్తున్న సమయంలో హైవే పోల్స్, లైటింగ్‌కు సంబంధించిన కంట్రోలింగ్ బాక్స్ తెరిచి ఉండడం వల్లే విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడని ఆరోపించారు. సెట్‌బాక్స్ మూసి ఉంటే విద్యుత్ తీగలు బయటకు వచ్చేవి కాదని, బాక్స్ తెరిచి ఉండడం వల్లే ఏడుకొండలు విద్యుత్ షాక్‌కు గురయ్యాడని, ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమేనని వారు మండిపడ్డారు. ఏడుకొండలు మృతిపై సంఘటనా స్థలం నుంచే విద్యుత్, పంచాయతీ శాఖలు, నేషనల్ హైవే అధికారులకు సమాచారమివ్వగా తమకు సంబంధం లేదంటే తమకు లేదని ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రెక్కాడితేగాని పొట్ట నింపలేని ఏడుకొండలు కుటుంబాన్ని అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.


