విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న బాక్సింగ్ పోటీలకు విజయనగరానికి చెందిన బి.సచిన్ ఎంపికయ్యాడు. ఇటీవల విశాఖలో జరగిన జూనియర్స్ బాక్సింగ్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన సచిన్ 70–75 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అంతేకాకుండా ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు నాగపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్స్ బాక్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. క్రీడాకారుడు సచిన్‌కు సీనియర్ బాక్సర్, ఎల్‌ఐసీ డెవెలప్‌మెంట్ ఆఫీసర్ బి.దివాకర్ రూ.5000 ఆర్థిక సాయం అందజేశారు.
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం
బొబ్బిలి రూరల్: మండలంలోని కోమటిపల్లి జంగాల వీధిలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మొతి గౌరికి చెందిన పూరిల్లు పూర్తిగా కాలిపోగా పక్కనే ఉన్న మొతి సాంబయ్యకు చెందిన పెంకిటిల్లు ముందుభాగాన ఉన్న రేకులు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు. గౌరి ఇంటి వద్ద కట్టెల వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్నికీలలు చెలరేగి ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. ప్రమాదంలో గౌరికి చెందిన ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోగా సుమారు లక్ష రూపాయిల ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు
గజపతినగరం: మండలంలోని తుమికాపల్లి గ్రామానికి చెందిన ఆకుల ఏడుకొండలు అధికారుల నిర్లక్ష్యంతోనే సోమవారం మృతి చెందాడని మృతుడి తండ్రి గౌరినాయుడు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతూ ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు.
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలకు అవకాశం
విజయనగరం అర్బన్: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ సమాన పదోన్నతుల కోసం సంబంధిత స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు వెల్లడించారు. జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపా ధ్యాయులు సరైన ఆధారాలతో ఈ నెల 1 నుంచి 6వ తేదీ వరకు పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వ్యక్తిగతంగా సమర్పించాలని సూచించారు.
రూ.46 కోట్ల పన్ను వసూలు
విజయనగరం: 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను వివిధ పన్నుల రూపేణా రూ.46 కోట్ల 16లక్షల 59,248లు మంగళవారం సాయంత్రానికి నగర పాలక సంస్థకు సమకూరిందని కమిషనల్ బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం పన్నులపై వడ్డీని 50 శాతం వరకు తగ్గించడంతో పన్ను చెల్లింపులు ఈసారి అధికంగా జరిగాయన్నారు. గత సంవత్సరం రూ.40కోట్ల 89లక్షల 97వేల, 281లు వసూలు కాగా ఈ సంవత్సరం ఆరు కోట్లు అదనంగా వసూలైందన్నారు. దీర్ఘకాల బకాయిలు, అధిక మొత్తం పన్నులు రాబట్టేందుకు కృషి చేసిన రెవెన్యూ సిబ్బందిని అభినందించారు. సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు నేతృత్వంలో బృందం పన్ను వసూలను, ప్రచారాన్ని ముమ్మరం చేయడం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం ఆస్తి పన్నులు రూ.37 కోట్ల 23లక్షల 65వేల 479లు ఈ సాయంత్రానికి వసూలు అయ్యాయన్నారు. ఖాళీ పన్నుల రూపేణా రూ.6కోట్ల53లక్షల 65వేల,103లు, నీటి చార్జీలు రూ.2కోట్ల 39లక్షల 28వేల 666లు వసూలు అయ్యాయన్నారు.


