విజయనగరం క్రైమ్: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అత్యంత అవసరమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, సామాజిక బాధ్యతలో భాగంగా బొబ్బిలికి చెందిన హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్‌ను మంగళవారం డీపీఓలో ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్‌దాస్‌ను శాలువాతో సత్కరించి, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ సహాయంతో అసాంఘిక కార్యక్రమాల కట్టడి, గుంపుల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, నేరాల నిరోధక చర్యలు, విపత్తుల సమయంలో శోధన, రక్షణ చర్యలు మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని తెలిపారు. ముఖ్యంగా పెద్ద ఎత్తున జరిగే సభలు, ఉత్సవాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో చిత్రీకరణకు డ్రోన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. వితరణ చేసిన డ్రోన్‌ను ఎస్పీ బొబ్బిలి పోలీసుస్టేషన్ సీఐ కె.నారాయణరావుకి అందజేసి నేర నియంత్రణలో విస్తృతంగా వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, ఇతర పోలీసు అధికారులు, హీరా ఎలక్ట్రో స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


