అంగన్‌వాడీలకు కొత్త మెనూ వారానికి రెండుసార్లు ఎగ్ ఫ్రైడ్‌రైస్ జీఓ జారీ చేసిన సర్కార్ ధరలకనుగుణంగా పెరగని మెనూ చార్జీలు కేంద్రాలకు నిర్వహణ భారం ఇప్పటికీ 2023 ధరలే.. మెనూ మేరకు నిధులివ్వకుంటే ఎలా... ప్రశ్నిస్తున్న అంగన్‌వాడీలు
ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాం..
రామభద్రపురం :
అంగన్‌వాడీ కేంద్రాలలో చదువుతున్న చిన్నారులకు రుచితో పాటు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం అందించేలా ప్రభుత్వం తాజాగా మెనూలో మార్పులు చేసింది. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ 6 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం కింద శనగ చిక్కీ, వేరుశనగ నూనెతో కూడిన పిండి నెలకు 2.50 కిలోల చొప్పున్న ఇంటికే ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు కూడా ఇంటికే రేషన్ పంపిస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాలలోనే వంట చేసి వారంలో ఒక రోజు పులిహోర పెడుతున్నా రు. ఆ స్థానంలో రెండు మార్పులు చేశారు. తాజాగా వారంలో రెండుసార్లు (మంగళ, శనివా రం) మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను చిన్నారులకు వండి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మిగతా నాలుగు రోజులు అన్నం పెట్టనున్నారు. మంగళ, శనివారాలు స్నాక్స్ కింద ఉడికించిన శనగలు, మిగ తా నాలుగు రోజులు పాటు ఉడికించిన కోడిగుడ్డు అందించనున్నారు. రోజూ 100 మి.లీ, చొప్పున్న యధావిధిగా ఇస్తారు. ఒంటిపూట కేంద్రాల నిర్వహణ అమల్లోకి రావడం, మరోపక్క కేంద్రాలకు శనగలు సరఫరా కాకపోవడంతో స్నాక్స్ అమలుకు సంబంధించి మరి కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.
వండలేక.. సొమ్ములు చాలక..
మాతా శిశు మరణాలను తగ్గించడంతో పాటు, బాలల భవిష్యత్‌కు పునాదులు వేసే అంగన్‌వాడీ కేంద్రాలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతల కు పౌష్టికాహారం అందించాల్పిన అంగన్‌వాడీలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచకుండా తాత్సారం చేస్తోంది. కాలానుగుణంగా నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు వంట గ్యాస్ సిలిండర్ ధర సైతం పెరగడమే కాకుండా ప్రస్తుతం గ్యాస్ దొరకడం గగనంగా ఉంది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలను పెంచకుండా గత ప్రభుత్వంలో 2023లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తోంది. పెరిగిన ధరలతో నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు వండి వడ్డించాలంటే వర్కర్లకు నానా పాట్లు తప్పడం లేదు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలోనే వండాల్సి ఉండటంతో కూరగాయలు, పసుపు, కారం, ఆకు కూరలు, ఉల్లి పాయలు, పొపు దినుసులు తదితర సామగ్రిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశించిన కొత్త మెనూ ప్రకారం వారంలో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్‌రైస్ చేయాల్సి ఉంది. మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకొక్కరికి రోజుకు కేవలం ట్రాన్స్‌పోర్ట్ ఖర్చుతో కలిపి ప్రభు త్వం మైదాన ప్రాంతాల వారికి రూ.2.10పైసలు గిరిజ న ప్రాంతాలలోని అంగన్‌వాడీ చిన్నారులకు రూ. 2.30పైసలు మాత్రమే చెల్లిస్తోంది. ఇందులోనే 50 పైసలు గ్యాస్‌కు, రేషన్ దుకాణాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు మైదాన ప్రాంతాలోని వారికి 10 పైసలు, గిరిజన ప్రాంతాల వారికి 30 పైసలు కేటాయించింది. అంటే కూరగాయలు తదితర సామగ్రి కోసం ఒక్కో చిన్నారికి రోజుకు కేటాయించింది రూ.1.50 పైసలు మాత్రమే. దీంతో పిల్లవాడికి పౌష్టికాహారం పెట్టడం ప్రశ్నార్ధకంగా మారింది. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం తెచ్చేందుకు ఒక్కొక్కరికి రోజుకు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు మైదాన ప్రాంతాలలో 25 పైస లు. గర్భిణులు, బాలింతలకు రూ.27 పైసలు, గిరిజన ప్రాంతాలలో చిన్నారులకు 27 పైసలు, గర్భిణులు, బాలింతలు 30 పైసలు చొప్పున్న చెల్లిస్తోంది. దీనికి తోడు గ్యాస్ సిలిండర్‌కు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము 50 పైసలు సరిపోవడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఇచ్చే మెనూ చార్జీల బిల్లులు కూడా రెగ్యులర్‌గా రావని, ఆరు నెలలు, ఏడాదికోసారి ఇస్తుండడంతో వర్కర్లు తమ జేబులో నుంచే పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు ఎందుకూ చాలడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలకు అనుగుణంగా పెరగని మెనూ చార్జీలు పెంచాలని కోరుతున్నారు.
మెనూ చార్జీలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో పెడతాను. ప్రభుత్వం ప్రస్తుతం కొత్త మెనూ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వారానికి రెండు రోజులు (మంగళ, శనివారం) ఎగ్ ఫ్రైడ్‌రైస్ చేసి పిల్లలకు పెట్టాల్సి ఉంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆదేశాలిస్తున్నాం.
– కేవీ బాలామణి, ఐసీడీఎస్ పీడీ,
విజయనగరం


