బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అంబటివలస గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ యు.మహేష్ తెలిపిన వివరాలు.. అంబటివలస గ్రామానికి చెందిన తాళ్లపూడి అప్పలనాయుడు(35) తాపీమేసీ్త్రగా పని చేస్తూ జీవనం చేస్తున్నాడు. మృతునికి భార్య ధనలక్ష్మితో పాటు మూడేళ్లు, ఆరేళ్లు వయసు కలిగిన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై గ్రామానికి ఆనుకొని ఉన్న తన బంధువుల మామిడితోటకు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వెళ్లి మామిడి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్టు చెప్పారు.


