వైభవంగా రాములోరి పట్టాభిషేకం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా రాములోరి పట్టాభిషేకం

Mar 29 2026 6:46 AM | Updated on Mar 29 2026 6:46 AM

రామతీర్థంలో శాస్త్రోక్తంగా సాగిన వేడుక

యాగశాలలో పూర్ణాహుతి ఘట్టం

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రప్రభువు పట్టాభిషేక మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు, వేద పండితుల సమక్షంలో వేకువజామునుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. యాగశాలలో పూర్ణాహుతిని వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం శాస్త్రోక్తంగా జరిపించారు. అనంతరం ఆస్థాన మండపంలో శేష వాహనంపై సీతారామచంద్ర స్వామిని ఆశీనులను చేసి మహాపట్టాభిషేకం సజావుగా సాగాలని ముందుగా విశ్వక్సేనుడి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూజాద్రవ్యాలకు పుణ్యాహవచనం గావించి తిలకించే భక్తుల హృదయాలు పవిత్రంగా ఉండాలని ప్రత్యేక పూజలు జరిపారు. అష్టోత్తర సహస్ర నామార్చనలతో స్వామివారికి విశేష పూజలు, అర్చనలు జరిపించారు. రామాయణంలో శ్రీ రామ పట్టాభిషేక ఘట్టాన్ని విన్నపం చేసి పంచామృతాలతో స్వామికి అభిషేకాలు జరిపారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారికి బంగారుకిరీటధారణ చేశారు.

రామాయణంలో ఆఖరి ఘట్టం పట్టాభిషేకం..

రామరాజ్య స్థాపనే ధ్యేయంగా శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్వహిస్తారని, దేవుళ్లలో ఒక్క శ్రీరామునికే మాత్రమే ఇది సాధ్యమని ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయిరామాచార్యులు తెలిపారు. ఏటా స్వామివారి కల్యాణం మరుసటిరోజు పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోందని, స్వామివారి పట్టాభిషేకాన్ని కనులారా వీక్షిస్తే సకల విజయాలు సిద్ధిస్తాయన్నారు. రామాయణంలో ఆఖరి ఘట్టమే పట్టాభిషేకమని చెప్పారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, వ్యాఖ్యాత హాయగ్రీవాచార్యులు, అర్చకులు నరసింహాచార్యులు, కిరణ్‌, పవన్‌, రామగోపాల్‌, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement