● అవసరమైన సాయం చేయండి..
● బోన్ కేన్సర్‌తో బాధపడుతున్న వైష్ణవి
● వైద్యం చేయించేందుకు దాతల కోసం ఎదురుచూపు
రాజాం సిటీ: తమలా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. వారు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. ఇద్దరు పిల్లల్లో పెద్దదైన కుమార్తె పదో తరగతి చదువుతుంది. పరీక్షలు దగ్గర పడుతుండడంతో కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అనుకున్న ఆమె ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. పరీక్షలపై బెంగ అనుకున్న ఆ తల్లిదండ్రులు ఆస్పత్రిలో చూపిస్తే అనుకోని విధంగా రోగమొచ్చిందని కుమిలిపోయారు. నయం అవుతుందేమోనని తమ స్థోమతకు మించిన అప్పులు చేసి విశాఖపట్నం ఆస్పత్రికి తరలించి మరిన్ని పరీక్షలు చేయించారు. అక్కడ చిన్నారికి బోన్‌మారో కేన్సర్ అని తెలియడంతో విలవిలాడిపోయారు. చిన్నారి వైద్యానికి రూ.లక్షల మేర ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడంతో ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటు దాతల దాతృత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన పత్తిరి వైష్ణవి అనే చిన్నారి బోన్‌మారో కేన్సర్ బారిన పడింది. ఇటీవల అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సనందించి విశాఖపట్నం తరలించారు. అక్కడ క్యూ1 ఆస్పత్రిలో అన్ని పరీక్షలు అనంతరం చిన్నారి వైష్ణవికి బోన్‌మారో కేన్సర్ ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అక్కడ అస్పత్రిలో రోజువారీ చికిత్స నిమిత్తం చిన్నారిని జాయిన్ చేసి వైద్యం కోసం ఏర్పాట్లు చేశారు. ఇదిలా
ఉండగా చిన్నారి తల్లిదండ్రులు పత్తిరి ధనలక్ష్మి, శివ రోజువారీ వ్యవసాయ కూలీలు. ఏదో ఒక పని చేసుకుని జీవనం సాగించే ఈ కుటుంబంలో వైష్ణవి బోన్ కేన్సర్ బారిన పడడం గండంగా మారింది. జీవనోపాధి లేక తల్లడిల్లుతున్న ఆ కుటుంబం తన కుమార్తె ప్రాణాలు కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వైద్య ఖర్చులు నిమిత్తం రూ.20లక్షలు అవసరం ఉండడంతో వైద్యం చేయించలేక దాతల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని దాతలను వేడుకుంటున్నారు.
పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉండగా..
చిన్నారి వైష్ణవి బొద్దాం జెడ్‌పీ హైస్కూల్‌లో పదో తరగతి చదివింది. ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలు ఆమె రాయాల్సి ఉండగా బోన్‌మారో కేన్సర్ వ్యాధి సోకడంతో పరీక్షలకు దూరమైంది. వైష్ణవిని ఉన్నత చదువులు చదివించి మంచి జీవితాన్ని ఇద్దామని ఆశపడిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. చదువు విషయం పక్కన పెడితే తమ కుమార్తె ప్రాణాలతో ఉంటే చాలని దేవుళ్లను వేడుకుంటున్నారు. దాతలు ముందుకు వచ్చి తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టాలని, ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఆర్థిక సాయం చేయదలచిన వారు 9618897442 నంబరుకు సాయమందించాలని కోరుతున్నారు.


