● జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్
విజయనగరం: బహుముఖ ప్రజ్ఞాశాలి పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం నేటి యువతకు ఆదర్శమని, బహుభాషలలో ప్రావీణ్యం సంపాదించిన యువతకు అవకాశాలు మెండుగా ఉంటాయని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు బహుబాషా కోవిదుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు. ముందుగా నారాయణాచార్యులు చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణాచార్యులు తెలుగు సాహితీ రంగానికి చేసిన కృషి అమోఘమని తెలిపారు. చిన్న వయసులోనే భారతం, భాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారని, సంగీతం, సాహిత్యం, నాట్య రంగాలలో రాణించటంతో పాటు తుళు, ఫ్రెంచి, పర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారని, పాలీ (బౌద్ధ, జైన సాహిత్యాలు) భాషలో మంచి ప్రావీణ్యం సాధించినట్టు గుర్తు చేశారు. పలు భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన ఆయన వధీ భాష నుంచి తులసీదాస్ రామాయణం, బ్రజ్ భాష నుంచి సూరదాస్, రసఖాన్ మొదలైన వారి రచనలతో పాటు ఆనేక ప్రసిద్ధ తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, ఉర్దూ, సంస్కృతం కావ్యాలను తెలుగులోనికి అనువదించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్.సత్తిబాబు, కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి దేవి ప్రసాద్, సెట్విజ్ సీఈఓ వి.విశ్వేశ్వరరావు, సెట్విజ్ మేనేజరు కె.వెంకటరమణ, సూపరింటెండెంట్ కె.అక్కారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


