విజయనగరం క్రైమ్:
నేరాల నియంత్రణకు ప్రతిరోజు పది ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమరవాణ, రోడ్డు ప్రమాదాల నియంత్రనలో భాగంగా విజిబుల్ పోలీసింగ్, ఆకస్మిక వాహన తనిఖీలను ఒక నిరంతర ప్రక్రియగా జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనదారులకు, ప్రజలకు రహదారి భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రజలకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రోడ్డు భద్రతతో పాటు ప్రజలకు వివిధ చట్టాలు, సైబర్ మోసాలు, మహిళల భద్రతతకు చేపట్టాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ, నేరాలను అదుపు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ఈ తనిఖీల్లో మోటారు వాహన చట్టం నిబంధనలు అతిక్రమించిన వారికి ఈ– చలానాలను విధిస్తున్నామని చెప్పారు.
పార్వతీపురం సుందరీకరణకు శ్రీకారం
పార్వతీపురం రూరల్ :
పర్యావరణ హితమే లక్ష్యంగా పార్వతీపురం నగర సుందరీకరణ పనులకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం గెడ్డ వీధి కాలువ వంతెన సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం కాలువ వంతెన అంచున (ఎడ్జ్ భాగంలో) కొబ్బరి మొక్కలను నాటారు. సోమవారం నుంచి వంతెన రెండో వైపు కూడా మొక్కలు నాటే పనులు కొనసాగనున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల మధ్య గల డివైడర్లలో ఆకర్షణీయమైన ‘బోగన్ విల్లియా’ మొక్కలను ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో సబ్–కలెక్టర్ వైశాలి, పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


