పైడితల్లి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

పైడితల్లి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు

Mar 27 2026 9:50 AM | Updated on Mar 27 2026 9:50 AM

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయం లెక్కింపు స్థానిక శివాలయం వీధిలో ఉన్న పైడితల్లి అమ్మవారి కల్యాణ మండపం ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ కె.శిరీషా మాట్లాడుతూ వనంగుడి హుండీల ద్వారా 20 రోజులకుగానూ రూ. 2 లక్షల 28 వేల 327లు వచ్చినట్టు తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు జి.శ్యామ్‌ ప్రసాద్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, సేవకులు పాల్గొన్నారు.

సారా స్వాధీనం

సాలూరు: పట్టణంలోని ఎరుకుల వీధిలో నాటుసారా స్వాధీనం చేసుకున్నట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ దాసు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ఏఈఎస్‌ సంతోష్‌, బీఎంపీపీ సీఐ నరసింహమూర్తి తదితరులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో, ఎరుకుల వీధిలో ఇద్దరు మహిళల నుంచి 12 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఎడ్లు పరుగు ప్రదర్శనలో కె.ఎల్‌.బి.పురం ఫస్ట్‌

వేపాడ: మండలంలోని బోజంకివానిపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన ఎడ్లు పరుగు ప్రదర్శనలో కె.ఎల్‌.బి.పురానికి చెందిన ఎడ్లు ప్రధమ స్థానంలో నిలిచాయి. గ్రామదేవత రావాలమ్మ తీర్థ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన ఎడ్లు పరుగు ప్రదర్శనలో 15 ఎడ్లు జతలు పాల్గొన్నాయి. మొదటి స్థానంలో నిలిచిన కెఎల్‌బి.పురానికి శిరికి దుర్గాప్రసాద్‌ ఎడ్లుకు రూ.పన్నెండు వేలు, రెండో స్థానంలో నిలిచిన నర్సయ్యపేటకు చెందిన ముమ్మన రామకృష్ణ ఎడ్లుకు రూ.పది వేలు, మూడో స్థానంలో నిలిచిన ఏడువాక సత్తిబాబు ఎడ్లుకు రూ.ఎనిమిది వేలు చొప్పున నగదు బహుమతులు గ్రామ పెద్దలు,కమిటీ సభ్యులు అందజేశారు. మహిళలు ప్రదర్శంచిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది.

నేరడి గ్రామంలోకి ఏనుగులు

భామిని: మండలంలోని నేరడి బీ గ్రామంలోకి ఏనుగుల గుంపు గురువారం ప్రవేశించింది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వెనుక భాగంలోకి ఏనుగులు తిరుగాడుతూ వచ్చాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేశాయి. కళ్లాల్లో నిల్వ ఉంచిన పశువుల దాణ, తవుడు బస్తాలను ధ్వంసం చేశాయి. గ్రామంలోని మూగజీవాలు ఏనుగుల గుంపు ప్రవేశంతో పరుగులు తీశాయి. గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

పాము కాటుకు గురైన మహిళ

సీతానగరం: మండలంలోని సుమిత్రాపురంలో బుధవారం రాత్రి ఇంటి వద్ద ఆరుబయట ఉన్న మహిళ పాము కాటుకు గురైంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. సుమిత్రాపురం గ్రామానికి చెందిన అజ్జాడ సత్యవతి బుధవారం రాత్రి ఇంటి వద్ద ఆరుబయట కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. గుర్తించిన సత్యవతి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సత్యవతి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement