తెర్లాం: మండలంలోని నందబలగ పంచాయతీ పరిధిలోని జనార్థనవలస(చిన నందబలగ) గ్రామంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు పశువుల శాలలతో పాటు, పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ పూర్తిగా దగ్ధం కాగా, ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనార్థనవలసలో గురువారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామానికి చెందిన యామలాపల్లి రాము, గేదెల శ్రీరాములుకు చెందిన రెండు పశువుల శాలలు పూర్తిగా కాలిపోయాయి. బాడంగి మండలం జీకేఆర్ పురం నుంచి జనార్థవలస గ్రామానికి తాపీ పని చేసేందుకు వచ్చిన మేసీ్త్ర తన మోటార్ సైకిల్‌ను పశువుల శాలలో ఉంచాడు. అగ్ని ప్రమాదంలో పశువుల శాలలో ఉన్న ఒక మోటార్ సైకిల్‌తో పాటు, నీరు తోడుకొనే ఆయిల్ ఇంజన్ ఈ ప్రమాదంలో దగ్ధమయ్యాయి. పశువుల శాలలో ఉన్న మోటార్ సైకిల్ కాలిపోతుండడంతో దానిని తీయడానికి వెళ్లిన కె.ప్రభాకరరావు అనే వ్యక్తి చేతులు కాలిపోయి గాయాలయ్యాయి. అతన్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వీఆర్‌ఓ ఆమిటి శ్రీనివాసరావు వెంటనే గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. అగ్ని ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు. అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న బొబ్బిలి అగ్నిమాపక సిబ్బంది శకటంతో వచ్చి మంటలు అదుపు చేశారు.


