● ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించి మరీ స్నాచింగ్
బొబ్బిలి: మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో ఈ నెల 3న జరిగిన చైన్ స్నాచింగ్ వివరాలను సీఐ కె.నారాయణ రావు విలేకర్లకు గురువారం వివరించారు. మల్లంపేటకు చెందిన కోడి బంగారమ్మ(80) అనే మహిళ ఇంటికి మధ్యాహ్న సమయంలో ఓ వ్యక్తి ఆడ వేషంలో వచ్చి మీ కోడలు పంపిందని మాయమాటలు చెప్పి మెడలో గొలుసు తెంపుకు పోయినట్టు తెలిపారు. చైన్ విలువ 23 గ్రాములుంటుందన్నారు. ఆమె కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దర్యాప్తులో భాగంగా అన్ని కోణాల్లో విచారించి నిందితుడ్ని పట్టుకున్నామన్నారు. ఈ కేసులో గొడ్డు వాసు అనే తారకరామా కాలనీ వాసి నిందితుడని గుర్తించి పట్టుకున్నారు. ఇతనిపై చెక్ బౌన్స్ కేసుందన్నారు. అలాగే బెట్టింగ్‌లకు పాల్పడుతున్నాడన్నారు. చివరికి ఇంటిని కూడా అమ్మేశాడన్నారు. అమ్మగా వచ్చిన ఇతని వాటా రూ.3లక్షలతో బెట్టింగ్ ఆడేశాడన్నారు. చివరగా చెక్‌బౌన్స్ కేసు, మరో పక్క అప్పులు వెంటాడుతుండటంతో దొంగతనానికి పాల్పడ్డాడన్నారు. మల్లంపేటలో వృద్ధురాలి ఇంటి పక్కనే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని రెక్కీ నిర్వహించాడన్నారు. వృద్ధురాలు ఒక్కరే ఉంటారని తెలుసుకుని మహిళ వేషంలో వెళ్లి చైన్ దొంగతనం చేశాడన్నారు. తిరిగి వెనక్కు వచ్చి మహిళ దుస్తులు విప్పేసి విశాఖ వెళ్లిపోయాడన్నారు. అక్కడ తెలిసిన వారి సాయంతో ముత్తూట్ కంపెనీలో కుదువ పెట్టాడన్నారు. ఆ తరువాత మళ్లీ ఆ వస్తువును విడిపించి హైద్రాబాద్ వెళ్లిపోయేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లి తచ్చాడుతుండగా తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. కేసులో పురోగతి సాధించిన సిబ్బందిని సీఐ కె.నారాయణ రావు అభినందించారు. ఎస్సై ఆర్.రమేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


