రామభద్రపురం: ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా.. కనీసం వేతనం లేకపోయినా అప్పులు చేసి అన్నం తయారు చేస్తున్నారు. విద్యార్థుల కడుపు నింపి ఆకలి తీర్చుతున్నారు. అలాంటి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టేందుకు స్మార్ట్ కిచెన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని విమర్శఽలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సింది పోయి తమ అనుయాయులకు మేలు జరిపేందుకు ప్రభుత్వ పెద్దలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాత్మకంగా అమలు చేసిన వైఎస్సార్ కడప జిల్లాలో విజయవంతమైందంటూ స్మార్ట్ కిచెన్ ఏర్పాటుకు నివేదికలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా అధికారులు కూడా ఆఘమేఘాల మీద సౌకర్యవంతంగా ఉన్న మండలానికి రెండు పాఠశాలల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేయగా వారు నివేదికలు పంపిస్తున్నారు. పదిలోపు విద్యార్థులున్న పాఠశాలలు తప్ప విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ల ద్వారా మధ్యాహ్న భోజనం సరఫరా చేయనున్నారు. ఒక చోట భోజనం తయారు చేసి 1 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.
విద్యార్థులకు ఇక చల్లని కూడే..
ఎక్కడో దూరంలో ఉన్న విద్యార్థులకు ఒక చోట భోజనం వండి వాహనాల్లో తీసుకెళ్లి ఇవ్వడం అన్నది వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీని వల్ల విద్యార్థులకు వేడి పదార్ధాలు తినే భాగ్యం లేనట్టేనని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు పాఠశాల ఆవరణలోనే మధ్యాహ్న భోజనం వండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కాంట్రాక్టర్ల చేతుల్లోకి పోతుంది. ఎవరిని సంతృప్తి పరచడానికి స్మార్ట్ కిచెన్లు తీసుకొస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి విద్యార్థులకు వండిపెడుతున్న కార్మికుల కడుపులు కొట్టి సొంత పార్టీ నాయకుల బొజ్జలు నింపేందుకే స్మార్ట్ కిచెన్ల రూపకల్పన జరిగినట్టు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. స్మార్ట్ కిచెన్లకు స్వస్తి పలకాలని కోరుతున్నాయి.
వంట కార్మికుల ఆందోళన..
మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలను తొలగించి స్మార్ట్ కిచెన్ల పేరుతో మధ్యాహ్న భోజనం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్న సమాచారంతో గ్రామీణ ప్రాంతాల్లో గత 20 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో వంటలు నిర్వహిస్తున్న మహిళలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే భోజన పథకం నిర్వాహకులను ఆదుకుంటాం అంటూ ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పొట్టకొట్టేందుకే ఈ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఫలితంగా 20 ఏళ్ల నుంచి పని చేస్తున్న తమను రోడ్డున పడేస్తే ఎలా? అని.. ఇన్నేళ్లుగా కష్టపడి పని చేసిన దానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రతిఫలం ఇదేనా.. అంటూ భోజన నిరాహకులు మండిపడుతున్నారు.
స్మార్ట్ కిచెన్ల ద్వారా మరో దోపిడీకి
రంగం సిద్ధం చేస్తున్న బాబు సర్కారు
తమ అనుయాయుల జేబులు
నింపేందుకు కుట్ర
మండలానికి రెండు చొప్పున్న ఏర్పాటుకు చర్యలు
ఎండీఎం పథకం మహిళల ఆందోళన
మధ్యాహ్న భోజన నిర్వాహకులు :
2920 మంది


