కల్యాణాన్ని వీక్షించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ఏర్పాట్లు పూర్తి చేశాం. దేవస్థానం తరఫున సుమారు 10వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపడుతున్నాం. భక్తులకు మంచినీరు, మజ్జిక, చిన్నపిల్లలకు పాలు, తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూల ఏర్పాటు, ఉచిత ప్రసాదాల పంపిణీ తదితర సౌకర్యాలను కల్పించాం. కల్యాణం సజావుగా సాగేందుకు భక్తులు సహకరించాలి.
– వై.శ్రీనివాసరావు, ఈఓ, రామతీర్థం దేవస్థానం
● రామతీర్థంలో నేడే సీతారాముల కల్యాణం
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికార
యంత్రాంగం
స్వామివారి
ఉత్సవ
విగ్రహాలు
నెల్లిమర్ల రూరల్:
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం.. సీతారామస్వామి వారి కల్యాణోత్సవానికి ముస్తాబయింది. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో శుక్రవారం జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. ప్రముఖుల రాక నేపథ్యంలో గడిచిన నాలుగు రోజులుగా వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లలో నిమఘ్నమయ్యారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కల్యాణ వేదిక చుట్టూ టెంట్లు, భక్తులకు సరఫరా చేసేందుకు మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లను సిద్ధం చేశారు. కల్యాణం పూర్తికాగానే స్వామివారి ముత్యాల తలంబ్రాల పంపిణీకి ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశారు. నవమి వేడుకల్లో భాగంగా ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పుష్ఫాలతో సుందరంగా అలంకరించారు. భారీ అన్నసమరాధన కార్యక్రమానికి దేవస్థాన అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. స్వామి కల్యాణానికి ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నేడు జరగనున్న కార్యక్రమాలు ఇవే...
వేకువజామున 3 గంటలకు స్వామివారికి ఆరాధన, బాలభోగం, తీర్థ గోష్ఠి, ఉదయం 6.30 గంటలకు శ్రీరామచంద్రస్వామివారి అవతార సర్గవిన్నపం, 7.30 గంటలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, వివిధ రకాల ఫలరసాలు, సముద్ర నదీ జలాలతో అష్టకలశ స్నపన మహోత్సవం జరగనుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువెళ్లి కల్యాణ ఘట్టాన్ని ప్రారంభిస్తారు. ప్రత్యేక పూజలనంతరం సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో మాంగళ్యధారణ జరగనుంది. అనంతరం స్వామివారి తలంబ్రాల సేవను వేద పండితులు జరిపించనున్నారు. ఇప్పటికే తిరుముల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు రామతీర్థం దివ్య క్షేత్రానికి చేరుకున్నాయి. శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ దంపతులు కల్యాణ ఘట్టానికి హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను శాస్త్రోక్తంగా స్వామివారికి సమర్పిస్తారు. సింహాచలం శ్రీ అప్పన్నస్వామి దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలను ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమర్పించనున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సుమారు 170 మంది పోలీసులతో భారీ బందోబస్తును పోలీస్‌శాఖ ఏర్పాటు చేసింది.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
స్వామివారి కల్యాణానికి రామతీర్థంలో గట్టిబందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటాం. 170 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు కొనసాగుతుంది. డీఎస్పీ స్థాయి అధికారి, ఏడుగురు ఎస్‌ఐలు, ముగ్గురు సీఐలు తమ విధులను నిర్వర్తించనున్నారు. కల్యాణాన్ని తిలకించేందుకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేశాం.
– గణేష్, ఎస్‌ఐ, నెల్లిమర్ల పోలీస్ స్టేషన్


