విజయనగరం ఫోర్ట్: ప్రస్తుతం రబీ సీజన్ చివరి దశకు వచ్చింది. వ్యవసాయ పనులు తగ్గాయి. ఉపాధిహామీ పనులు కల్పిస్తే కాస్త ఆర్థిక ఆసరా కలుగుతుందని వేతనదారులు ఆశిస్తున్నా పనులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పనులులేక పోవడంతో చాలామంది పేద కూలీలు దూరప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. ఓ వైపు పనికి ఆసక్తిచూపేవారందరికీ ఉపాధిహామీ పనులు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ ఓ వైపు గొప్పలు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని వేతనదారులు పెదవి విరుస్తున్నారు.
పనులు చేసే అవకాశం ఉన్నా..
జిల్లాలో 775 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాబ్ కార్డులు 3.45 లక్షలు ఉన్నాయి. వీటిలో 6,26,094 మంది వేతనదారులు ఉన్నారు. వర్షాకాలంలో చెరువులు, గుంతల్లో నీరు నిండుగా ఉండడం వల్ల పనులు చేసేందుకు అవకాశం ఉండదు. ప్రస్తుతం వేసవి కాలం వచ్చింది. చెరువుల, గుంతల్లో నీరు తగ్గిపోయింది. పనులు చేపట్టేందుకు అవకాశం ఉన్నా ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో పనులు లేక వేతనదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే 5 నుంచి 7 నెలలుగా ఉపాధిహామీ పనులు కల్పించని పరిస్థితి. మరికొన్ని గ్రామాల్లో 500 నుంచి 700 మంది వేతనదారులుంటే కేవలం 20 నుంచి 30 మందికే పనికల్పిస్తున్నారు.
పనుల కల్పనకు చర్యలు
జిల్లాలో చాలా గ్రామాల్లో పనులు జరుగుతున్నాయి. ఎక్కడైనా ఉపాధిహామీ పనులు పెట్టకపోతే సంబంధిత ఎంపీడీఓకు వేతనదారులు ఫిర్యాదు చేయవచ్చు. పనిఅడిగిన వారికి పని కల్పించే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం పనులు జరగని గ్రామాల్లో పనుల కల్పనకు చర్యలు తీసుకుంటాం.
– ఎస్.శారదా దేవి, పీడీ, డ్వామా
గంట్యాడ మండలం పెదవేమలి గ్రామంలో రెండు నెలలుగా ఉపాధిహామీ పనులు జరగడంలేదు. గ్రామంలో 500 నుంచి 700 మంది వరకు వేతనదారులు ఉన్నారు. ఉపాధిహామీ పనులు పెట్టకపోవడం, ఇతర పనులు లేక పోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. కొందరు వలసవెళ్తున్నారు.
మెంటాడ మండలం గుర్ల తమ్మిరాజుపేట, కూనేరు గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జరగడం లేదు.
వంగర మండలంలో ఎం.సీతారామపురం, శివ్వాం గ్రామాల్లో 7, 8 నెలలుగా ఉపాధిహామీ పనులు చేయని పరిస్థితి.
బాడంగి మండలం భీమవరం, రామభద్రపురం మండలం రావివలస గ్రామంలో ఉపాధిహామీ పనులు కల్పించలేదు.
గుర్ల మండలం జమ్ము, చింతలపేటల్లోనూ ‘ఉపాధి’కి కటకటే..
చీపురపల్లి మండలంలో 19 పంచాయతీలు ఉన్నాయి. గ్రామాల్లో 20 నుంచి 30 మందికి మాత్రమే ఉపాధిహామీ పనులు కల్పిస్తున్నారు.
కొన్ని గ్రామాల్లో జరగని ఉపాధిహామీ పనులు
మరికొన్ని గ్రామాల్లో తక్కువ మందికి మాత్రమే పనుల కల్పన
జిల్లాలో 775 గ్రామ పంచాయతీలు
6,26,094 మంది వేతనదారులు
పనులు లేకపోవడంతో అవస్థలు పడుతున్న వేతనదారులు


