రాజాం సిటీ: రాజాం మండలం పొగిరి గ్రామంలో డయేరియా వ్యాప్తిపై అధికారులు ఆరా తీశారు. గ్రామంలో డీఎంహెచ్‌ఓ జీవనరాణి గురువారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో డయేరియా కేసులు లేవని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా కోలుకున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గురువారం కూడా మరోకేసు రావడంతో మరింత అప్రమత్తమై గ్రామంలో పరిస్థితిని చక్కదిద్దేవరకు సేవలందించాలని వైద్యాధికారి జి.భార్గవికి సూచించారు. ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ గ్రామంలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు వేయండి ‘నాయనా’..
బొబ్బిలి రూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీపరిధి రాజుపేట గ్రామానికి వెళ్లే రోడ్డు పూర్తిగా పాడైంది.. పెద్దపెద్ద గోతులతో దర్శనమిస్తోంది... రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం.. ఎమ్మెల్యే బేబినాయన స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన యువకులు సోషల్‌మీడియాలో విన్నవించారు. గోతుల రోడ్డుపై ప్రయాణానికి గర్భిణులు, విద్యార్థులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి రోడ్డును చూసి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.


