విజయనగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు.
రాములోరి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలి
● మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ
అప్పలనాయుడు
● రామతీర్థంలోని శ్రీరామచంద్రమూర్తికి పట్టువస్త్రాల సమర్పణ
నెల్లిమర్ల రూరల్: జగదభి రాముడు శ్రీరామచంద్రస్వామి ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆకాంక్షించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఈ నెల 27న రామతీర్థంలో జరగనున్న స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా బుధవారం సతీమణి పద్మావతితో కలిసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వారికి ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బడ్డుకొండ మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమికి ముందుగానే రామతీర్థం సీతారామస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక అని, ఆయన ఆశీస్సులు ప్రజలందరిపైనా ఉండాలన్నారు. కల్యాణోత్సవంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలను బడ్డుకొండ దంపతులకు అందజేశారు.
వేంకటేశ్వరుని హుండీల ఆదాయం రూ.6.92లక్షలు
గరుగుబిల్లి: తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరాముని ఆలయాల హుండీల ఆదాయం రూ.6,92,880 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు. దేవదాయశాఖ బొబ్బిలి డివిజన్ సీఐ ఎన్.రాజకుమారి పర్యవేక్షణలో గతేడాది డిసెంబర్ 31 నుంచి ఈ ఏడాది మార్చి 25 వరకు హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, అర్చకులు వి.వి.అప్పలాచార్యులు, టీటీడీఎస్‌టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


