చీపురుపల్లిరూరల్ (గరివిడి):
టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి పోరాడదామని ఎమ్మెల్సీ, శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం గరివిడి, మెరకముడిదాం మండలాలకు చెందిన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడంపై పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీల నియామకాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సమన్వయంతో నాయకులు ముందుకు సాగాలని, కమిటీల నియామకాలు పకడ్బందీగా అమలు జరగాలని సూచించారు. గ్రామాల్లో ఉండే కమిటీలు బలంగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఉంటుందన్నారు. ఇక ముందు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదామని తెలిపారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు చోటుచేసుకున్నా తన దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో ధీరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొత్స సందీప్, బొత్స అనూష, ఎంపీపీ మీసాల విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, వైస్ ఎంపీపీ జి.శ్రీరాములనాయుడు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు లెంక శ్రీరాములు, ఎలకల అప్పలనాయుడు, ఎడ్ల అప్పారావు, మెరకముడిదాం మండల నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, కోట్ల విశ్వేశ్వరరావు, తాడ్డి వేణు, రెండు మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.


