విజయనగరం ఫోర్ట్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన తయారైంది జిల్లా క్షయ నివారణ శాఖ అధికారుల పరిస్థితి. పోస్టులు భర్తీ చేయాలని ఉన్నత అధికారులు చెప్పినప్పటకీ ఇంతవరకు చేపట్టకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత వైద్య రంగంలో పోస్టులు కొత్తగా భర్తీ చేసిన దాఖలాలు లేవు. జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. జీరో వేకేన్సీ పాలసీ ద్వారా వైద్య శాఖల్లో పోస్టులు ఖాళీ అయిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేశారు. ఇలా విజయనగరం జిల్లాలో రెండు వేలకు పైగా పోస్టులు వైద్య రంగంలో భర్తీ చేశారు.
ఐదు పోస్టుల భర్తీకి ఆదేశాలు
క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు రెండు నెలలు క్రితం ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇంతవరకు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. దీంతో పోస్టులు భర్తీ చేస్తారో.. లేదోనని నిరుద్యోగ అభ్యర్థుల్లో సందేహం నెలకొంది. పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్ కో ఆర్డినేటర్ (పీపీసీ) పోస్టు–1, సీనియర్ టీబీ సూపర్‌వైజర్ పోస్టు–1. ట్యూబర్‌క్యూలొసిస్ ల్యాబ్ సూపర్‌వైజర్ (ఎస్‌టీఎల్‌ఎస్) పోస్టులు–2, అకౌంటెంట్ పోస్టు ఒకటి భర్తీ చేయాల్సి ఉంది.
వేలాది మంది ఎదురుచూపులు
వైద్య రంగంలో వివిధ కోర్సులు చదివిన వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారు. కొంతమంది బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ, డీఎంఐటీ, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్, థియేటర్ అసిస్టెంట్, ఆడియోమెట్రిషిన్, ఫిజియోథెరపిస్టు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఆఫ్తామాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులు చదివిన అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరంతా పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుందా... అని ఆశగా ఎదురు చూస్తున్నారు.
క్షయ రోగుల పర్యవేక్షణ కోసం..
క్షయ వ్యాధి బారిన పడ్డ వారు సకాలంలో మందులు వాడుతున్నారా.. లేదా.. మందులు మధ్యలో ఏమైనా మానివేస్తున్నారా.. అని సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తారు. కఫం పరీక్ష కోసం వచ్చిన వారికి సకాలంలో పరీక్ష చేస్తున్నారా.. లేదా, ఆశ వర్కర్లు ద్వారా వారికి సకాలంలో మందులు అందుతున్నాయా.. లేదా, నెలకు అందించే రూ.1000 ప్రోత్సహకం వారికి అందుతుందా.. లేదా అని పర్యవేక్షిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే రోగుల్లో క్షయ లక్షణాలు ఉన్న వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిస్తున్నారా.. లేదా అని పీపీసీ పర్యవేక్షిస్తారు.
ఆదేశాలొచ్చాయి..
క్షయ నివారణ శాఖలో ఐదు పోస్టులు భర్తీ చేయమని ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తాం. – డాక్టర్ కె.రాణి,
జిల్లా క్షయ నివారణ అధికారిణి
క్షయ నివారణ శాఖ పోస్టుల
నియామకంలో జాప్యం
భర్తీకి ఆదేశాలొచ్చినా పట్టించుకోని వైనం
నోటిఫికేషన్ విడుదల చేయని
ఉన్నతాధికారులు


