● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి
విజయనగరం ఫోర్ట్: క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవీమాధవి అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వారాలకు మించి దగ్గు ఉంటే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. క్షయ వ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చునని తెలిపారు. మందులు క్రమం తప్పకుండా వాడాలన్నారు. అనంతరం సర్వజన ఆస్పత్రి పలమనాలజిస్టు డాక్టర్ సంతోష్‌కుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీటీసీఓ డాక్టర్ రాణి, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లోక్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.


