సాలూరు: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా ఉండగా.. నేటి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో వ్యవసాయం దండగగా మారిందని, రైతన్న వెన్నువిరుస్తున్నారని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తంచేశారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరతో కలిసి మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా వంటి కష్టకాలంలోను రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందని గుర్తుచేశారు. పంట చేతికొచ్చే సమయానికి ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతన్నకు మద్దతు ధర అందించేదన్నారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న పంట కొనుగోలుకు కనీస చర్యలు తీసుకోవడం లేదని, రైతుకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధర అందాల్సి ఉండగా దళారులకు రూ.1600లకే విక్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు లాఠీదెబ్బలు, వడదెబ్బ తినాల్సి వస్తోందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం సక్రమంగా అందక పంట పెట్టుబడి కోసం రైతులు వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇకనైనా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులుతెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, మరోవైపు సంక్షేమ పథకాల అమలే మరిచిపోయారని, కనీసం కొత్తగా ఒక్క వృద్ధాప్య, వితంతు పింఛన్ మంజూరు చేయడంలేదని విమర్శించారు.
● గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి గిరిజనులను పట్టించుకోవడం లేదని, వారికి ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదని జెడ్పీ చైర్మన్ ఆరోపించారు. ఇదే తొలిసారి, ఆఖరిసారని భావించి అన్ని విధాలుగా సర్దుకుంటున్నారన్నారు. సాలూరు నియోజకవర్గంలో కుమ్ములాటలు, అవినీతి, దోపిడీ పాలన, ఉద్యోగాల తొలగింపులే కనిపిస్తున్నాయని విమర్శించారు. కొత్తగా సంక్షేమం, అభివృద్ధి పనులు చేపట్టకుండా, గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను ప్రారంభోత్సవాలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాలూరు వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవంలో అందరినీ పిలిచి, ఏ ప్రభుత్వ హయాంలో ఎంత మేర పనులు జరిగాయో బహిరంగంగా చెప్పి ఉండాల్సిందన్నారు. పాచిపెంటలో పెద్దగెడ్డ రిజర్వాయర్‌కు వైఎస్సార్ శంకుస్థాపన చేసి ప్రారంభించారని, రాజన్నదొర జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడి పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు పెట్టించి నియోజకవర్గానికి కేంద్రీయ గిరిజన యూనివర్సిటీని తీసుకువచ్చారని వివరించారు. పాలకులకు వత్తాసు పలుకుతూ నిబంధనలకు నీళ్లు వదలడం అధికారులకు తగదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం గుర్తించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఇబ్బందులు తప్పవన్నారు.
● మున్సిపాలిటీలో బోసుబొమ్మ కూడలి వద్ద గతంలో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు నాటి టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారని రాజన్నదొర గుర్తుచేశారు. అప్పుడు ప్రత్యేక జీఓ తీసుకువచ్చి విగ్రహాన్ని ఏర్పాటుచేశామన్నారు. అంబేడ్కర్, కూనిశెట్టి వెంకటనారాయణదొర విగ్రహ ఏర్పాటును కూడా నాడు అడ్డుకున్నారని, నేడు ఎటువంటి తీర్మానాలు లేకుండా ఎన్‌టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ఉపాధిహామి పథకంలో అవినీతి, అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. యూరియా, ఇంధన కష్టాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగగా మారింది
పంటలకు మద్దతు ధర లేదు..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు కానరావు
పంటను పారబోస్తున్నా పాలకులకు పట్టడంలేదు
గిరిజన సంక్షేమాన్ని విస్మరించిన
మంత్రి సంధ్యారాణి
ప్రభుత్వ తీరును ఎండగట్టిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


