● పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు
● కొత్తనేతలకు అవకాశాలు
● మారనున్న అసెంబ్లీ ముఖచిత్రాలు
విజయనగరం సాక్షిప్రతినిధి: అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వార్త రాజకీయ ఆశావహుల నోట్లో అమృతం పోసినట్టుంది. ఎంతసేపూ వాళ్లేనా... సీట్లు వాళ్లకేనా.. మేం ఒకసారైనా మైకుపట్టుకుని అధ్యక్షా అని మాట్లాడొద్దా... అసెంబ్లీ కారిడార్‌లో రాయల్‌గా నడవద్దా? మనకు గన్‌మ్యాన్ వద్దా... ఎన్నాళ్లీ మండలస్థాయి పదవులు.. ఇక మన రేంజి మారాలి.. ఎంతఖర్చయినా ఫర్లేదు.. ఈసారి మనం పోటీ చేయాల్సిందే అనుకుంటూ కలలు కంటున్న ద్వితీయకేటగిరీ నాయకులకు ఇది తీయని వార్త. రాష్ట్రంలో భారీగా అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయంటూ కేంద్రం చెప్పిన కబురు మండుటెండలో నడుస్తున్న వాళ్లకు చిరుజల్లులా అనిపిస్తోంది.
ఆశల పల్లకిలో...
సరాసరి 1,60,000 మంది జనాభాకు ఒక ఎమ్మెల్యే ఉండేలా కేంద్రం నియోజక వర్గాలను పునర్విభజిస్తుండడంతో జిల్లాలోని పలువురు నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలు కాస్తా 12 కానుండగా, పార్వతీపురం జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు ఇప్పుడు ఆరుకు పెరగనున్నాయి. దీంతో పాటు మహిళలకు కూడా ఈసారి రిజర్వేషన్ కల్పిస్తుండడంతో ఆ దిశగా కూడా నాయకులు ఆలోచనలు మొదలుపెట్టారు. గతంలో నియోజవర్గాలుగా ఉంటూ రద్దయిన ఉణుకూరు, సతివాడ, భోగా పురం వంటి నియోజకవర్గాలు మళ్లీ పునరుద్ధరణ జరుగుతుందా? లేక ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల్లో భాగంగా ఉన్న మండలాలను విడదీసి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనా కానీ జిల్లా కేంద్రాలకు అనుబంధంగా ఇప్పుడు గ్రామీణ నియోజకవర్గాలు రావచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో విజయనగరం రూరల్, పార్వతీపురం రూరల్ వంటి నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నట్లు ప్రాథమిక సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లా
నేతలకు తీపి కబురు
పార్వతీపురం మన్యం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలుండగా అవన్నీ రిజర్వ్ స్థానాలు కావడం గమనార్హం. కురుపాం, పాలకొండ, సాలూరు ఎస్టీ స్థానాలు కాగా పార్వతీపురం మాత్రం ఎస్సీ రిజర్వ్ స్థానం. వాస్తవానికి ఈ నాలుగు చోట్లా బీసీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నప్పటికీ వారికి ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం దక్కడం లేదు. దీంతో అక్కడి వెలమ, కాపు సామాజిక వర్గ నేతలు తమకు అసెంబ్లీ ఛాన్స్ రావడంలేదని లోలోన కుమిలిపోతున్నారు. కాగా బయటపడి ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు అక్కడ రెండు స్థానాలు కొత్తగా వస్తుండటంతో ఆ రెండూ ఖచ్చితంగా జనరల్ సీట్లు అవుతాయని ,వాటిలో పోటీ చేసే అవకాశం తమకు దక్కుతుందని ఆశిస్తున్నారు.


