ప్రభుత్వ భవనాల నిర్మాణంలో
విజయనగరం: జిల్లాలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనలో అలసత్వం వద్దని, పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో పనుల ప్రగతిపై మంగళవారం సమీక్షించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ఏపీఐపీ, ఆర్‌ఐడీఎఫ్ 15 శాతం నిధులు, ఎంబీఎంబీ, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల కల్పన, పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, అర్బన్ హెల్త్ సెంటర్ భవనాల నిర్మాణంపై శాఖలవారీగా సమీక్షించారు. వచ్చేజూన్ నాటికి అన్ని భవనాలను పూర్తిచేయాలని, పంచాయతీ నిధులతో అంగన్‌వాడీ కేంద్రాలకు తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, ఐసీడీఎస్ పీడీ బాలామణి, ఏపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, వివిధ శాఖల ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
1331 దరఖాస్తులకు ఆమోదం
ఈ ఏడాది జనవరి 21 నుంచి మార్చి17వ తేదీ వరకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 1359 దరఖాస్తులు అందగా 1331 దరఖాస్తులకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన భూములను ఇచ్చేందుకు ఏపీఐఐసీ, రెవిన్యూ అధికారులు సానుకూలంగా ఉండాలన్నారు. పీఎంఈజీపీ కింద 2025–26 సంవత్సరానికి 499 దరఖాస్తులు అందాయని తెలిపారు. బ్యాంకులకు 387 దరఖాస్తులను పంపామని, మొత్తం 270 దరఖాస్తులు గ్రౌండింగ్ పూర్తయినట్టు వెల్లడించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ ఎం.వి.కరుణాకరన్, ఏపీఐఐసీ అధికారులు పాల్గొన్నారు.
త్వరితగతిన ప్రాజెక్టుల భూసేకరణ
జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, హైవేలు, రైల్వేలైన్లకు భూసేకరణపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, ఆర్డీఓలు, ఆర్‌అండ్‌బీ ఈఈలు పాల్గొన్నారు.


