రాజాం సిటీ: మండలంలోని సారథి అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. అక్కడి రికార్డులతో పాటు పౌష్టికాహార నిల్వలను పరిశీలించారు. పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. సకాలంలో పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి అభ్యసనా సామర్థాలు తెలుసుకున్నారు. ముందుగా రాజాం మున్సిపాల్టీ పరిధి లచ్చయ్యపేట, సారథి, మిర్తిరెడ్డివీధి సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, ప్రభుత్వ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం.రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.


