వేంకటేశ్వరస్వామిపై రాజకీయాలు తగవు
● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
విజయనగరం రూరల్: తిరుమల లడ్డూ వివాదం విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినా మళ్లీ అదే విషయంపై రాజకీయం చేయడం మాను కోవాలని వైఎస్సార్‌సీపీ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ప్రజలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై చెప్పడం, అడగడం పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టకుండా, ఉన్నది లేనట్లుగా అలజడి సృష్టించి, రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పుతోందన్నారు. చేతులెత్తి కోరుతున్నాను.. రాష్ట్రంలో ప్రజలందరికీ వేంకటేశ్వరస్వామి ఇలవేల్పు అని, అటువంటి దేవ దేవుడిని వివాదంలోకి తీసుకురావడం చాలా అపచారమన్నారు. దర్యాప్తు సంస్థ సిట్ వివరణ ఇచ్చిందని, అంతటితో సమసిపోకుండా అధికారంలో ఉన్న నాయకులు, టీటీడీ దేవస్థానం చైర్మన్ ఆ విషయంపై మాట్లాడి వివాదాస్పదం చేయడం దారుణమన్నారు. కల్తీ నెయ్యి పరీక్షలకు మరోసారి ల్యాబ్‌కు పంపిస్తారని చెప్పి, అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జంతు కొవ్వు ఉందని విమర్శలు చేస్తే... సుప్రీంకోర్టు స్పందించి సీబీఐతో విచారణ జరిపించిందని, దర్యాప్తులో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదని తేలిందన్నారు. సింహాచలం దేవస్థానంలో నెయ్యి కలుషితమైందని పత్రికల్లో అశోక్ గజపతిరాజు ఫొటోతో వార్త ప్రచురితమైందన్నారు. మేము ఏమైనా అశోక్ గజపతిరాజు రాజీనామా చేయాలని అడిగామా అని ప్రశ్నించారు. అత్యుత్తమ న్యాయస్థానం ఇచ్చిన రిపోర్టును గౌరవించకుండా, ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం సరికాదన్నారు. వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు వేయడం సమంజసం కాదన్నారు. ధైర్యం ఉంటే వాటి కింద మీ పార్టీ పేరు రాసుకోవచ్చు కదా అని మండిపడ్డారు. ఏమైనా తప్పు జరిగితే ట్రస్టు బోర్డు మీద, అధికారులు మీద చర్యలు తీసుకోవాలని ప్రకటించకుండా, మళ్లీ పవిత్రతను పోగొట్టేలా చైర్మన్ మాట్లాడ డం సరికాదన్నారు. ఈ వివాదానికి టీటీడీ ముగింపు పలకాలన్నారు. తప్పుడు నివేదిక ఇచ్చిన ఈఓను సరెండర్ చేయాలని డిమాండ్ చేశారు. దేవాలయాలకు వెళ్లకూడదని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల్లో విశ్వాసం ఉందా? పోయిందా? అనేది మూడేళ్ల తర్వాత తెలుస్తుందన్నారు.
గీతంకు ఏ ప్రాతిపదికన భూమి కేటాయిస్తారు..
ప్రజలకు ఉపయోగపడితే ఏ సంస్థకై నా భూములివ్వడంలో అభ్యంతరం లేదని, గీతం అనేది ప్రైవేటు సంస్థ, ఇప్పటికే 78 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు.. మరో 54 ఎకరాలకు పైగా తమ ఆధీనంలో ఉందని గీతం విద్యా సంస్థల అధినేత, ఎంపీ భరత్ స్వయంగా చెప్పారు.. అది భూ కబ్జా కాకపోతే ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సుమారు రూ.5వేల కోట్ల విలువ చేసే భూమిని వేలంవేస్తే వచ్చే డబ్బులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పీపీపీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ సురేష్‌బాబు పాల్గొన్నారు.


