అలరించిన బండ్ల వేషాలు
● ఎనిమిది గ్రామాలకు సంబంధించి బల్లంకి తీర్థం
● అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
వేపాడ: మండలంలో ప్రసిద్ధి చెందిన బల్లంకి గ్రామదేవత మరిడిమాంబ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా నిర్వహించిన బండి ప్రభలు పలువురిని ఆకట్టుకున్నాయి. 26,27,28 మూడురోజులపాటు ఈ తీర్థమహోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం తీర్థంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం మహిషాసుర మర్దిని తులసీ జలంధర, ప్రమీలార్జునీయం, కురుక్షేత్రం, ద్రౌపది వస్త్రాపమరణ, శ్రీరామపట్టాభిషేకం, హానుమద్రామ సంగ్రామం, గరుడ గర్వభంగం తదితర బండ్ల వేషాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అలాగే మహిళాకోలాటం, పులివేషాలు, కోయడ్యాన్సులు, డప్పువాయిద్యాలు రెల్లివేషధారణలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ తీర్థం బల్లంకి, బానాది, ఎం.శింగవరం, భర్తవానిపాలెం, నీలకంఠరాజపురం, పెదగుడిపాల జమ్మాదేవిపేట తదితర గ్రామాలకు సంబంధించి తీర్థం కావడంతో జనసందోహంగా తీర్థం జరిగింది. తీర్థంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వల్లంపూడి ఎస్సై సుదర్శన్ నేతృత్వంలో బందోబస్తు నిర్వహించారు. ఈ నెల 28న ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీసభ్యులు తెలిపారు.
అలరించిన బండ్ల వేషాలు


