మహిళ ప్రాణం కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామానికి చెందిన గొట్టాపు లావణ్య మానసిక వేదనతో బాధపడుతోంది. శనివారం రాత్రి ఆమె సమీపంలో ఉన్న బావిలోకి దూకడంతో విషయం తెలుసుకున్న పాలకొండ ఫైర్ ఆఫీసర్ జామి సర్వేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళ ప్రాణాలను కాపాడారు. చాలా ఏళ్లుగా ఆమె మానసిక వేదనతో బాధపడుతోంది. గతేడాది కూడా ఇదే విధంగా ఆమె ఈ బావిలోకి దూకినప్పుడు పాలకొండ ఫైర్ సిబ్బంది ఆమెను కాపాడారు. మళ్లీ రెండోసారి శనివారం కూడా ఆమెను ప్రాణాలతో కాపాడిన ఫైర్ సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
రెండు గడ్డివాములు దగ్ధం
బొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన పడాల వెంకటరావు రెండు గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురి కాగా సమాచారం అందడంతో అగ్నిమాపక వాహనంతో వెళ్లి మంటలు అదుపు చేసినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 వేల ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలిపారు. మంటలు ఇతర గడ్డి వాములుతో పాటు, పశువుల పాకలకు వ్యాపించకుండా అదుపు చేసినట్లు తెలిపారు.
గంజాయి పీలుస్తున్న
ఐదుగురి అరెస్టు
శృంగవరపుకోట: మండలంలోని బొడ్డవర పరిధిలో రైల్వేస్టేషన్ వద్ద డొంకల్లో గంజాయి పీలుస్తున్న ఐదుగురు వ్యక్తులను ఎస్‌కోట పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం పట్టుబడిన వారిని ఎస్.కోట గ్రామానికి చెందిన గణేష్, మహ్మద్, వినోద్‌కుమార్‌తో పాటు ధర్మవరం గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, అనకాపల్లికి చెందిన పూర్ణకుమార్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శనివారం వారిని ఎస్.కోట జుడిషియల్ కోర్టులో హాజరు పరచగా కోర్టు వారిని రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించింది. వారిపై గతంలో ఎస్‌కోట పోలీస్‌స్టేషన్, విశాఖ సిటీ స్టేషన్‌లలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎస్‌కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు.
డబ్బుల కోసం గొడవలో
వ్యక్తి మృతి
రామభద్రపురం: మండలంలోని పాతరేగ గ్రామంలో శనివారం డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తుం మధ్య జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాసర్ల సింహాచలం (70), పెద్దింటి తిరుపతిల మధ్య డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవలో చేతులతో కొట్టుకుంటున్న సమయంలో వృద్ధుడు సింహాచలాన్ని తిరుపతి గట్టిగా తోసేశాడు. దీంతో కింద పడిన సింహాచంల తల అక్కడే ఉన్న కొళాయి దిమ్మకు తగిలింది. దెబ్బచిన్నదే కదా అనుకుని ఎవరూ పట్టించుకోకపోవడంతో అదే రోజు రాత్రి సింహాచలం మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేశారు. సోమవారం విజయనగరం నుంచి క్లూస్‌టీం తెప్పి దర్యాప్తు చేయనున్నారు.
మహిళ ప్రాణం కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
మహిళ ప్రాణం కాపాడిన అగ్నిమాపక సిబ్బంది


