పారా ప్రపంచ గ్రాండ్ ప్రిక్స్ పోటీలకు పైడిరాము ఎంపిక
విజయనగరం: దుబాయి వేదికగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు జరగబోయే 17 వ ఫాజా ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్–2026 పోటీలకు విజయనగరం జిల్లాకు చెందిన కొత్తింటి పైడిరాము ఎంపికయ్యాడని, ఇది జిల్లాకు దక్కిన గొప్ప అవకాశమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన పైడిరాముకు అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ పారా ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో కొత్తింటి పైడిరాము ఎఫ్–51 కేటగిరిలో డిస్క్ త్రో ఈవెంట్‌లో పాల్గొంటాడని చెప్పారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తరఫున పాల్గొని అనేక మెడల్స్ గెలుచుకున్న పైడిరాము దుబాయిలోనూ సత్తా చాటుతాడన్న ఆశాభావాన్ని దయానంద్ వ్యక్తం చేశారు. ప్రపంచ పోటీలకు ఎంపికై న పైడిరాముకు కలెక్టర్ రాం సుందరరెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వర రావులు శుభాకాంక్షలు తెలియజేశారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకుని రావాలంటూ ప్రోత్సహించారు.
మక్కువలో చోరీ
మక్కువ: మండల కేంద్రం మక్కువలో బుధవారం రాత్రి రెండు చోట్ల చోరీలు జరిగినట్లు ఎస్సై ఎం.వెంకటరమణ గురువారం తెలిపారు. స్థానిక బీసీ కాలనీకిచెందిన పాలవలస ఇందిర ఇంట్లో దొంగలు ప్రవేశించి 5 తులాల బంగారం, కొంత నగదు దొంగిలించినట్లు బాధితురాలు ఇందిర ఫిర్యాదు చేశారని తెలిపారు. అలాగే స్థానిక నాయుడువీధి సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం ఆవరణలో కన్యకాపరమేశ్వరి అమ్మవారి వెండికిరీటం, హుండీలో కొంత నగదును దొంగిలించినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


