కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆర్డీవో
కె.సీతారాంపురంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయాన్ని తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోల దృష్టికి తీసుకువెళ్లడంతో ఆర్డీవో రామమోహన్‌రావు శనివారం గ్రామానికి వచ్చి పాపమ్మ మృతదేహాన్ని, బాధితులను పరామర్శించారు. రెవెన్యూ పరంగా ఐదు రోజులకు సరిపోయే ఆహార పదార్ధాలను బాధితులకు అందజేశారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో బాధితులకు పునరావాస కేంద్రాన్ని తహసీల్దార్ ఏర్పాటు చేశారని, ఇల్లు కాలిపోయిన బాధితులకు నష్టపరిహారంగా రూ.13వేలు చొప్పున అందించనున్నట్టు చెప్పారు. ఉప తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్‌ఐ కృష్ణమూర్తి, వీఆర్‌వోలు గణపతి, రాము, శ్రీనివాసరావు, సుధాకర్, రవి తదితరులు సంఘట జరిగిన నుంచి గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించడంతో పాటు, బాధితులకు సేవలు అందించారు. బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు సంఘటనా స్థలానికి వచ్చి అగ్ని ప్రమాదంలో మృతి చెందిన పాపమ్మ మృతదేహాన్ని పరిశీలించారు. సంఘటనా స్థలంలోనే మృతురాలికి శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు.
తెర్లాం: మండలంలోని కొరటాం గ్రామ పంచాయతీ కె.సీతారాంపురం(చిన గొలుగువలస) గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోగా, 85ఏళ్ల వృద్ధురాలు సజీవ దహనమైంది. దీనికి సంబంధించి శనివారం స్థానికులు, బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని యాతవీధి(కల్లుగీత కార్మికులు)లో శుక్రవారం రాత్రి 10.30గంటల సమయంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో అదే వరుసలో ఉన్న 12 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోష్టు లక్ష్మి ఇంట్లో ఉంటున్న ఆమె అత్త కోష్టు పాపమ్మ(85)మంటల్లో చిక్కుకొని సజీవ దహనమైంది. ప్రమాదంలో గ్రామానికి చెందిన ఎద్దుమంటి వెంకటమ్మ, కోష్టు చినవెంకటయ్య, పోలారావు, లక్ష్మి, గురువులు, ఆదమ్మ, పెదవెంకట రమణమ్మ, పెదనర్సయ్య, అప్పడు, నక్క రవణమ్మ, చోడి సింహాచలం, రాములుకు చెందిన ఇళ్లన్నీ పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంలో సుమారు రూ.6లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని రాజాం అగ్నిమాపక కేంద్రం అధికారులు, రెవెన్యూ అధికారులు అంచనా వేశారు.
సజీవ దహనమైన వృద్ధురాలు పాపమ్మ
గ్రామంలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరగడంతో ఇంట్లో ఉన్న కోడలు, పిల్లలు భయంతో బయటకు వెళ్లిపోయారు. మంచంపై ఉన్న కోష్టు పాపమ్మ(85) అనే వృద్ధురాలు బయటకు రాలేకపోవడంతో మంటల్లో చిక్కుకుంది. గ్రామస్తులు స్పందించి ఆమెను మంటల్లో నుంచి బయటకు తీసేటప్పటికే కాలిపోయి మృతి చెందింది. మృతురాలు పాపమ్మకు కోడలు లక్ష్మి, ఆమె కుమారుని పిల్లలు మాత్రమే ఉన్నారు. పాపమ్మ అగ్ని ప్రమాదంలో మృతి చెందడంతో కోడలు, ఆమె మనవరాళ్లు కన్నీరుమున్నీరుగా విలపించారు.
కట్టుబట్టలతో...
ఈ అగ్ని ప్రమాదంలో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రమాదంలో ఇళ్లల్లో ఉన్న సామగ్రి, బట్టలు, తిండి గింజలు, బంగారం, వెండి, నగదు, ఇండేన్ గ్యాస్ సిలెండర్లు, ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు, పెన్షన్ కార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన కోష్టు గురువులకు చెందిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.80వేలు నగదు, 50తులాల వెండి, తిండి గింజలు కాలిపోయాయి. కోష్టు అప్పన్నకు చెందిన అర తులం బంగారు వస్తువులు, సారి సామాన్లకు ఉంచిన రూ.లక్ష నగదు కాలి బూడిదైంది. కోష్టు పెదనర్సయ్యకు చెందిన 10 తులాల వెండి, రూ.20 వేలు నగదు కాలిబూడిదైంది. కోష్టు లక్ష్మికి చెందిన పావు తులం బంగారం, 10తులాల వెండి పట్టీలు, రూ.8వేలు నగదు ఈ ప్రమాదంలో కాలిపోయాయని బాధితులు లబోదిబోమంటూ రోదిస్తున్నారు. బాధితులందరికీ కట్టు బట్టలు మినహా ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలిపోయాయి. ప్రమాద విషయాన్ని రాజాం అగ్ని మాపక కేంద్రానికి స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంబంధిత అధికారులు, సిబ్బంది శకటంతో వచ్చి మంటలను అదుపు చేశారు.
కె.సీతారాంపురం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించి అధికారులతో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ చిన్నశ్రీను, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు
కాలిపోయిన 12 పూరిళ్లు
మంటల్లో సజీవ దహనమైన వృద్ధురాలు కోష్టు పాపమ్మ
బాధితులను పరామర్శించిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి
ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బొబ్బిలి ఆర్డీవో, తహసీల్దార్
రూ.6 లక్షల ఆస్తి నష్టం
కె.సీతారాంపురం(చినగొలుగువలస) గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద వార్తను తెలుసుకున్న జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడుతో కలిసి శనివారం ఉదయం గ్రామానికి వచ్చి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. ప్రమాద వివరాలను స్థానిక నాయకులను, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అందాల్సిన సహాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారితో పాటు తెర్లాం ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు నర్సుపల్లి బాబ్జీరావు, గర్భాపు రామారావు, వైస్ ఎంపీపీలు చేపేన సత్యనారాయణ, అప్పలరాజు, కొరటాం ఎంపీటీసీ సాకేటి నాగమణి, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు. అగ్ని ప్రమాద బాధితులను బుడా చైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు పరామర్శించారు.
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం
కె.సీతారాంపురంలో ఘోర అగ్ని ప్రమాదం


