గడ్డివాములు దగ్ధం
తెర్లాం: మండలంలోని గొలుగువలస గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు గడ్డివాములతో పాటు ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. దీనికి సంబంధించి బాధితులు శనివారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాకేటి శ్రీనివాసరావు, అప్పలనాయుడులకు చెందిన గడ్డివాములు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. గడ్డివాముల పక్కనే నూర్పిడి చేసి నిల్వ ఉంచిన ఽగొట్టిపల్లి గణపతికి చెందిన ధాన్యం కూడా పాక్షికంగా మంటలకు కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే వెళ్లి మంటలను ఆదుపు చేయడంతో ధాన్యం పూర్తిగా కాలిపోకుండా నివారించగలిగామని రైతులు అంటున్నారు. గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న తహసీల్దార్ హేమంత్‌కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు గ్రామానికి వెళ్లి కాలిపోయిన గడ్డివాములను, పాక్షికంగా దెబ్బతిన ధాన్యాన్ని పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి గర్భాపు రామారావు, గొలుగువలస సర్పంచ్ ప్రతినిధి గులివిందల శంకరరావు, ఎంపీటీసీ సభ్యురాలు సాకేటి నాగమణి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక నాయకులు ఉన్నారు.
నాకౌట్ దశకు సాఫ్ట్‌బాల్ పోటీలు
వీరవాసరం: వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్‌బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు విజయనగరం జిల్లా బాలికల జట్టు గుంటూరు జట్టుపై 02:01 తేడాతో.. విజయనగరం జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 04–01 తేడాతో గెలుపొందాయి. బాలికల క్వార్టర్ ఫైనల్‌లో విజయనగరం జట్టు శ్రీకాకుళం జట్టుపై 12–01 తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. అలాగే బాలుర ఫలితాల్లో విజయనగరం జట్టు విశాఖ జట్టుపై 03–00 తేడాతో, విజయనగరం జట్టు చిత్తూరు జట్టుపై 05–00 తేడాతో విజయం సాధించాయి. బాలుర క్వార్టర్ ఫైనల్‌లో విజయనగరం జట్టు ప్రకాశంపై గెలిచి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆదివారం ముగింపు కార్యక్రమం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బాల బాలికల జట్లను ఎంపిక చేయడం జరుగుతుందని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాచింకి శ్రీనివాస్ తెలిపారు.
ప్రారంభమైన పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ పారా రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు శనివారం స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది ఉండదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని కొనియాడారు. పారా రాష్ట్ర స్థాయి పోటీలను తొలిసారిగా విజయనగరంలో నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. దివ్యాంగులు ఎవరికి తక్కువ కాదని, జిల్లాలో ప్రతిభ గల దివ్యాంగ క్రీడాకారులకు కొదవ లేదని వారిని గుర్తించి క్రీడల్లో ప్రోత్సహిస్తున్న పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు, మాజీ రోటరీ గవర్నర్ డాక్టర్. ఎం.వెంకటేశ్వరరావు, రాష్ట్ర స్థాయి పోటీల కన్వీనర్ నాలుగెస్సుల రాజు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, విశాఖపట్నం గౌరవ అధ్యక్షులు డాక్టర్ షీతల్ మదాన్, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్, సారధి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు ప్రదీప్, ప్రతాప్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
గడ్డివాములు దగ్ధం
గడ్డివాములు దగ్ధం


