అంతా బాగుందనుకున్నారు... ఇంతలోనే...
● చికిత్స పొందుతూ మృత్యు ఒడికి చేరిన పాలిటెక్నిక్ విద్యార్థి
● కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి
● ప్రాణం మీదకి తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్
చీపురుపల్లి: తానొకటి తలచితే.. దైవం మరొకటి తలచింది.. అన్న సామెత అక్షరాల ఆకాష్ విషయంలో స్పష్టమయ్యింది. ప్రతీ రోజూ మాదిరిగా కళాశాల విడిచిపెట్టారు. ఆకాష్ ఇంటికో.. వసతిగృహానికో.. వెళ్లిపోవాలనే రోడ్డెక్కాడు. స్నేహితులతో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రోడ్డుపై నడుస్తున్నాడు. కానీ విధి ఆ యువకుడుని మృత్యువు వైపు లాగుతుండడంతో వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను లిఫ్ట్ అడిగేలా చేసింది. ఆ ట్రాక్టర్ లిఫ్ట్ కాస్త నిండు నూరేళ్లు జీవించాల్సిన ఆకాష్‌ను తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లింది. ఐదు రోజులుగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న పాలిటెక్నిక్ విద్యార్థి ఆకాష్(17) శనివారం మృతి చెందాడు. వెల్డింగ్ పని చేసుకుంటూ కొడుకుని బాగా చదివించుకోవాలని ఎంతో కోరికతో పాలిటెక్నికల్ విద్య చదివిస్తున్న ఆకాష్ తండ్రి కన్న కలలు చెదిరిపోయాయి. ఎంతో ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు కళ్ల ముందు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు.
ప్రాణాల మీదకు తెచ్చిన ట్రాక్టర్ లిఫ్ట్
జామి మండలంలోని అలమండ గ్రామానికి చెందిన జి.ఆకాష్ పట్టణంలోని జీవీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్థానిక ఎస్సీ కళాశాలల బాలుర వతిసగృహంలో ఉంటూ చదువుతున్నాడు. ఈ నెల 6న కళాశాల ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆకాష్ తిరిగి 8న నేరుగా కళాశాలకు వచ్చాడు. ఆ రోజు కూడా తరగతులు ముగించుకుని పట్టణ శివారున ఉన్న కళాశాల నుంచి స్నేహితులతో కలిసి రోడ్డెక్కాడు. వెనుక నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను లిఫ్ట్ అడిగాడు. కుర్రాళ్లు లిఫ్ట్ అడిగారు కదాని ట్రాక్టర్ డ్రైవరు ఆపి లిఫ్ట్ ఇచ్చాడు. నలుగురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్ ఎక్కిన ఆకాష్ ట్రాక్టర్ కదిలిన కాసేపటికే ఇంజన్ – తొట్టె మధ్య భాగంలో ప్రమాదవశాత్తూ జారి పడిపోయాడు. దీంతో ఆకాష్‌పై నుంచి ట్రాక్టర్ వెళ్లింది.
చికిత్స పొందుతూ మృత్యు ఒడిలోకి
ఈ నెల 8న కేజీహెచ్‌లో చేరిన ఆకాష్‌కు కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు. గత ఐదు రోజులుగా వసతిగృహ సంక్షేమాధికారి మంగళగిరి శ్రీనివాసరావు కేజీహెచ్ వద్దనే ఉంటూ ఆకాష్ యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. శుక్రవారం నాటికి ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు కూడా చెప్పారు. కానీ ఇంతలోనే ఏమైందోగాని శనివారం మృతి చెందడం కలచివేసింది. ఈ మేరకు చీపురుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతా బాగుందనుకున్నారు... ఇంతలోనే...


