సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం అవసరం
● విశాఖ ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత
● జేఎన్‌టీయూ జీవీలో ఘనంగా జెన్ ఏఐ హ్యాకథాన్ ప్రోగ్రామ్
విజయనగరం రూరల్: ప్రపంచ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాల్సిన అవపరం ఎంతైనా ఉందని విశాఖపట్నానికి చెందిన ఎఫ్ అండ్ ఓఐసీ, ఎస్టీపీఐ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బాత అన్నారు. స్థానిక జేఎన్‌టీయూ – జీవీలో హైదరాబాద్‌కు చెందిన జెన్ ఏఐ వర్సిటీ, జేఎన్‌టీయూ జీవీ సంయుక్త ఆధ్వర్యంలో ‘జెన్ ఏఐ హ్యాక్‌థాన్ ఫరధ నెక్ట్స్ జనరేషన్ జాబ్స్’ సాంకేతిక కార్యక్రమాన్ని శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శాస్త్రవేత్త సురేష్ బాత మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య పూర్తయిన తరువాత విద్యార్థులకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని అన్నారు. వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి ఇటువంటి హ్యాక్‌థాన్ కార్యక్రమాలకు హాజరవడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. తద్వారా కృత్రిమ మేధస్సును (ఏఐ) ఉపయోగించి సమాజానికి మేలు చేస్తూ, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన జెన్ ఏఐ వర్సిటీ చీఫ్ అకాడమీ అధికారి నరేంద్ర అల్లం మాట్లాడుతూ ఏఐలో నైపుణ్యం ఉన్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, మానవ మనుగడలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. జేఎన్‌టీయూ జీవీ రిజిస్ట్రార్ జి.జయసుమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుతో భావి తరాల నాయకులు, ఆవిష్కర్తలు, సమస్యలకు పరిష్కారాలు చూపే వారిని రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర అల్లం రచించిన పైథాన్ ప్రోగ్రామింగ్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శాస్త్రవేత్త సురేష్ బాతను ఘనంగా సత్కరించారు. ప్రోగ్రామ్ కన్వీనర్, జేఎన్‌టీయూ జీవీ ప్రిన్సిపాల్ ఆర్.రాజేశ్వరరావు, సమన్వయకర్తలు డాక్టర్ జిజె.నాగరాజు, ఆర్‌డిడివి.శివరామ్, ఆచార్యులు కె.బాబు, జి.స్వామినాయుడు, కెసిబి.రావు, డి.రాజ్యలక్ష్మి, కలేషావలి, ఆర్.గురునాధ, కె.అచ్యుతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి
శృంగవరపుకోట : అరుకు ఘాట్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువు పాలయ్యాడు. ఎస్.కోట పట్టణంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న షేక్ ఇర్ఫాన్(19) శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఎస్.కోట నుంచి మేక మాంసం తీసుకుని, స్నేహితునితో కలిసి అనంతగిరిలో ఇటీవల ప్రారంభించిన దుకాణానికి రాత్రి 9.30గంటల సమయంలో వెళ్తుండగా కాశీపట్నం టోల్‌గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీకొట్టాడు. దీంతో ఇర్ఫాన్ బైక్ పై నుంచి ఎగిరి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుడిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తెచ్చి అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గం మద్యలోనే ఇర్ఫాన్ మృతి చెందాడు. ఇర్ఫాన్ తండ్రి మదీనా బైక్ మెకానిక్‌గా పని చేస్తుండగా, తల్లి, తమ్ముడు ఉన్నారు.


