జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం
● జిల్లా పర్యటనలో టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు
విజయనగరం అర్బన్: రాష్ట్రంలో సాస్కి (ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం ద్వారా వచ్చే నిధులతో జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని టీఆర్ అండ్ బీ, ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వీటీ కృష్ణబాబు తెలిపారు. శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించి పలు రహదారులను పరిశీలించారు. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డితో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రహదారుల పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ ఈ ఏడాది సాస్కి పథకం కింద రూ.500 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏడాది నుంచి రూ.2 వేల కోట్లతో మరింత విస్తృతంగా పనులు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రహదారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, మార్చి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి అనుకూల సమయమని గుంతల పూడ్చే పనులను వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు వేగంగా చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సిబ్బంది కొరతను అధిగమించేందుకు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లను పదోన్నతి ఇచ్చి గ్రేడ్–1 వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా తీసుకునేందుకు ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే సంబంధిత సమస్యలు పరిష్కారానికి పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డీఓ, రైల్వే అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ వి.రామచంద్ర, సూపరింటెండెంట్ ఇంజినీర్ కాంతిమణి, ఆర్‌డీవో దాట్ల కీర్తి, ఆర్‌అండ్‌బీ ఈఈలు, డీఈలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.


