వసూళ్లకు కల్పవృక్షంలా ఆవాస్
● రూ.4 లక్షలు ప్రభుత్వ సాయం అంటూ అబద్ధపు ప్రచారం
● అర్హుల సర్వే పేరుతో టీడీపీ కార్యకర్తల మామూళ్ల దందా
● ఒక్కో దరఖాస్తు నమోదుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు వసూలు
విజయనగరం అర్బన్: పేదలకు గృహ కల్పన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రోత్సాహక పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలకు కల్పవృక్షంగా మారింది. స్థలం చూపిస్తే ఇల్లు కట్టుకోవడానికి రూ.4 లక్షల వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం లభిస్తుందని రాష్ట్రలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో టీడీపీ కార్యకర్తలు భారీగా ప్రచారం చేస్తూ వచ్చారు. పేదల్లో ఆశలు కల్పిస్తూ దరఖాస్తు నమోదుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వస్తున్నాయి. పీఎంఏవై గృహ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అంటూ విస్తృతంగా ప్రచారం చేసి జిల్లాలోని 36,862 మంది పేదల నుంచి వసూలు చేసుకుని నమోదు చేయించారు. ఏడాదిన్నర తరువాత ఈ దరఖాస్తు నమోదు విధానాన్ని రద్దు చేస్తూ ఇటీవల కొత్తగా పోర్టల్‌ను కేంద్రేప్రభుత్వం రూపొందించింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడు మళ్లీ ఈ పోర్టల్ ద్వారా నమోదు కావాలని నిర్దేశించింది. దీంతో కొత్తగా స్వీకరిస్తున్న పోర్టల్ విధానంలో మరోసారి దరఖాస్తు నమోదు చేయాలని చెప్పి మళ్లీ వసూళ్లు ప్రారంభించారు. గతంలో నమోదు చేసుకున్న 36,356 మందితోపాటు కొత్తగా అర్హులున్న వారంతా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని ప్రకటించారు. దీంతో క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలకు ‘ఆవాస్’ పథకం ఉపాధి భృతిగా మారింది.
నమోదు పోర్టల్‌లో 13,676 దరఖాస్తుల సర్వే
స్థలం చూపిస్తూ ఇళ్లనిర్మాణ పథకానికి ఏడాదిన్నరగా సచివాలయాల్లో స్వీకరించిన 36,862 మంది పేదల దరఖాస్తులను రద్దు చేస్తూ నూతనంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు ప్రక్రియను తాజాగా ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే దరఖాస్తుచేసి రద్దు జాబితాలో ఉన్న వారి రైస్ కార్డు, ఉపాధి జాబ్ కార్డు, ఈకేవైసీ అనుసంధానం, మహిళా లబ్ధిదారులు, ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారుల వంటి అంశాలపై అర్హత సర్వే చేపడుతున్నారు. సర్వే చేసేపనిని కొద్దిరోజులుగా జిల్లాలో హౌసింగ్ శాఖ చేపడుతోంది. సోమవారం నాటికి 13,676 దరఖాస్తుల సర్వే మాత్రమే పూర్తయింది.
కొత్త పోర్టల్‌లో నమోదుకు అడ్డంకులు
కేంద్రప్రభుత్వం కొత్త పోర్టల్ ద్వారా నమోదు చేయడానికి నిర్దేశించిన ప్రక్రియ పేద ప్రజలకు మరింత సమస్యగా మారింది. గృహ నిర్మాణానికి చూపించిన భూమి రిజిస్ట్రేషన్ లబ్ధిదారుని పేరులో తప్పనిసరి ఉండాలి. జిల్లాలో సాధారణంగా పాత తరాల పేర్లలో ఉన్న స్థలాలు ఎక్కువ. వాటిని రిజిస్ట్రేషన్‌గా మార్చుకోవాలంటే రెవెన్యూ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. పొజిషన్ సర్టిఫికెట్ (పీసీ) తప్పనిసరి చేశారు. దీని కోసం సర్వేయర్ల నుంచి తహసీల్దార్ వరకు సంతకాలకు కాళ్లరిగేలా తిరగాల్సి ఉంటుంది. ఆ ప్రయత్నంలో మామ్మూళ్ల బెడద ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. మొత్తంగా పీసీ, సర్వే రిపోర్టు, ల్యాండ్ కన్‌ఫర్మేషన్ తదితర ప్రతి పని కోసం అనధికార రేట్లు డిమాండ్ చేస్తున్నారంటూ ఆశావహులు వాపోతున్నారు.


