అందరికీ నాణ్యమైన విద్యుత్
చికెన్
సీతానగరం: విద్యుత్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడానికి, కేడర్ వారీగా గ్రామాలకు నూతన లైన్లు వేయడం, సబ్‌స్టేషన్లలో బ్రేకర్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ కనస్ట్రక్షన్ జిల్లా డీఈ పురుషోత్తం అన్నారు. ఈ మేరకు మండలంలోని అప్పయ్య పేట సబ్‌స్టేషన్‌లో కనస్ట్రక్షన్ విద్యుత్‌శాఖకు సంబంధించిన న్యూ బ్రేకర్‌ను ఏఈ పి.శశిభూషణ రావు ఆధ్వర్యంలో గురువారం నిర్మించారు. ఈ మేరకు డీఈ పురుషోత్తం మాట్లాడుతూ జిల్లాలోని అన్నిమండలాల్లో కనస్ట్రక్షన్ విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ క్రమంలో మండలంలోని సబ్‌స్టేషన్‌లకు అనుసంధానంగా విద్యుత్‌శాఖ నిర్ధారించిన డొమెస్టిక్ పర్పస్‌కు ఒకలైన్, పరిశ్రమలకు ఒకలైన్ వంతున నిరంతరం విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్డుకు ఇరువైపులా కొత్తగా స్తంభాలు వేయడాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఆయా పనులు పూర్తయితే విద్యుత్ సరఫరాలో అంతరాయం నివారణ, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు దోహద పడుతుందన్నారు. కార్యక్రమంలో కనస్ట్రక్షన్ శాఖ ఏడీఈ లక్ష్మీనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


