నల్లపూసల చైన్ చోరీ
చీపురుపల్లి: పట్టణంలోని కొత్తఅగ్రహారంలో బుధవారం రాత్రి 7 గంటల వీధిలోని రోడ్డు నుంచి ఇంటిలోకి వెళ్తున్న మహంతి అనూష మెడలో 2.5 తులాల నల్లపూసలు చైన్‌ను ఓ ఆగంతుకుడు తెంపుకుని పారిపోయాడు. దీంతో బాధితురాలు చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఎస్సై ఎల్.దామోదరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనూష సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి సమీపంలోని శివాలయంలో సుబ్రహ్మణ్యషష్టి పూజకు వెళ్లి తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయం నుంచి ఇంటికి బయల్దేరింది. అప్పటికే మాటు వేసి ఉన్న దుండగుడు ఆమె వెంటే వెళ్లి ఇంటి గేటులోకి ఆమె వెళ్తున్న సమయంలో మెడలో ఉన్న బంగారు వస్తువులు తెంపుకుని పారిపోయాడు. దీంతో 2.5 తులాల నల్లపూసలు చైన్ చోరీకి గురైనట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులతో ఎస్సై మాట్లాడారు.
మరో ఘటనలో పుస్తెలతాడు
వీరఘట్టం: మండలంలోని పాలమెట్ట–తూడి రోడ్డులో రాగోలు అన్నపూర్ణమ్మ అనే వృద్ధురాలి కంటిలో కారం కొట్టి ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు పుస్తెలతాడును ఓ ఆగంతుకుడు గురువారం మధ్యాహ్నం లాక్కుని పారిపోయాడు. తమ పొలంలో వరిచేను పనులు జరుగుతుండడంతో కుటుంబ సభ్యులకు భోజనం పట్టుకుని అన్నపూర్ణమ్మ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ యువకుడు ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ అకస్మాత్తుగా ఆమె కంటిలో కారం కొట్టాడు. కంటిలో కారం పడడంతో వృద్ధురాలు మంటతో విలవిల్లాడిపోతుండడంతో వెంటనే ఆమె మెడలోని పుస్తెల తాడు లాక్కుని పరారయ్యాడు. దొంగతనం జరిగిందన్న విషయం తెలియడంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముమ్మరంగా గాలించినప్పటికీ దొంగ ఆచూకీ తెలియలేదు.
నల్లపూసల చైన్ చోరీ


