సెలూన్ షాపు దగ్ధం
రాజాం: పట్టణంలోని జీఎంఆర్‌ఐటీ రోడ్డులో ప్రధాన రహదారి పక్కనే ఉన్న సొనాయిల తవుడుకు చెందిన హెయిర్ సెలూన్ షాపు గురువారం అగ్నికి ఆహుతైంది. పక్కనే ఉన్న చెత్తకుప్పలకు పెట్టిన నిప్పు మంటలు షాపువరకూ వ్యాపించి ఉంటాయని పలువురు భావిస్తున్నారు. ఈ ప్రమాదం జరుగుతున్న సమయంలో షాపు యజమాని అక్కడ లేడు. చుట్టుపక్కల షాపుల యజమానులు సెలూన్‌షాపు కాలిపోతుండడం గుర్తించి రాజాం ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ పైల అశోక్‌తో పాటు సిబ్బంది అగ్నిమాపకశకటం ద్వారా అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే షాపుమొత్తం కాలిపోయింది. ఫైర్ సిబ్బంది షాపు యజమానికి సమాచారం అందించి వివరాలు సేకరించారు.
25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
బొబ్బిలిరూరల్: మండలంలోని పిరిడి గ్రామం నుంచి గర్భాం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం వ్యాన్‌లో బియ్యం తరలిస్తుండగా జె.రంగరాయపురం వద్ద సీఎస్‌డీటీ సాయికృష్ణ వ్యాన్‌ను అడ్డుకుని 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ిఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పిరిడి గ్రామానికి చెందిన రేపాక శ్రీను పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామని నిందితుడిపై 6ఎ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. వ్యాన్‌ను పోలీసులకు అప్పగించి బియ్యం జె.రంగరాయపురం డీలర్‌కు అందజేశామని తెలియజేశారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిపై నిఘా ఉంచామన్నారు.
అదనను కట్నం వేధింపుల కేసు నమోదు
కొత్తవలస: మండలంలోని రాజానగర్ కాలనీకి చెందిన పుచ్చా జ్ఞానేశ్వరి విజయనగరంలోని ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన కె.రాజుకుమార్ ప్రే మించి పెద్దల సమక్షంలో ఈ ఏడాది మే నెలలో పెళ్లి చేసుకున్నారు. కాగా నాటి నుంచి సుఖంగా సాగు తున్న సంసారంలో ఇటీవల అదనపు క ట్నం, బంగారం, బండి వంటి వస్తువులను తీసుకురావాలని జ్ఞానేశ్వరిని రాజ్‌కుమార్ వేధిస్తుండడంతో పాటు తక్కువ కులానికి చెందిన దానివంటూ అవమాన పరుస్తున్నాడని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు జ్ఞానేశ్వరి గురువారం ఫి ర్యాదు చేసినట్లు సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడు రాజ్‌కుమార్‌పై అదనపు కట్నం వేధింపులు, కులదూషణ కేసులు నమో దు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ చెప్పారు.
అర్హులు ఇళ్ల కోసం నమోదు చేసుకోవాలి
పార్వతీపురం: ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) 2.0 పథకం కింద అర్హులైన లబ్ధిదారులు ఇళ్లకోసం గ్రామ పంచాయతీలోని సర్వే బృందంతో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని కలెక్టర్ డా.ఎన్ ప్రభాకరరెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 10నుంచి జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈల ఆధ్వర్యంలో సర్వే చేపట్టనున్నామన్నారు. పార్వతీపురం, పాలకొండ, సాలూరు మున్సిపాల్టీలు మినహా మిగిలిన పంచాయతీల్లో ఈసర్వేను చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇంతవరకు 23,151మంది ఇంటికోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. అర్హులై ఉండి పేర్లు నమోదు చేసుకోకపోతే ఈనెల 30లోగా నమోదు చేసుకోవాలని సూచించారు.
సెలూన్ షాపు దగ్ధం


