మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
● డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: మాతాశిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్యులు పనిచేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జీవనరాణి సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షించారు. గర్భస్థ దశలో తీసుకోవాల్సిన చర్యలను గర్భిణులకు వివరించాలన్నారు. హైరి స్క్ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వారికి ఐరన్ శుక్రోజ్ ఇంజిక్షన్లు, రక్తం ఎక్కించాలన్నారు. సమావేశంలో డీఐఓ డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, డీసీహెచ్‌ఎస్ ఎన్.పి.పద్మశ్రీరాణి, వైద్యులు సుజాత, కె.సత్యనారాయణ, దీపక్‌కుమార్, ఐసీడీఎస్ ప్రతినిధి బి.రామకోటి, తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
● జేసీ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఈ నెల 10 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలుకు క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు పక్రియలో మిల్లర్ల పాత్ర కీలకమన్నారు. ఇప్పటికే సంతకవిటి, వంగర, తెర్లాం తదితర మండలాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ధాన్యం తరలింపునకు సుమారు 4,600 వాహనాలను గుర్తించామని, వాటికి జీపీఎస్ పరికరాలు అమర్చుతామని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి జి.మురళీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
డిపాజిట్ల సేకరణతో డీసీసీబీ బలోపేతం
చీపురుపల్లి: డిపాజిట్ల సేకరణతో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బలోపేతం అవుతుందని చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. చీపురుపల్లి పట్టణంలోని డీసీసీబీ బ్రాంచి కార్యాయలంలో గురువారం ఏర్పాటు చేసిన డిపాజిట్ల సేకరణలో ఆయన పాల్గొన్నారు. పలువురు ఖతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించి బాండ్లను అందజేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నాలుగు నెలల్లో రూ.23 కోట్లు డిపాజిట్లు సేకరించినట్టు స్పష్టంచేశారు. డిపాజిట్లకు అధిక వడ్డీతో పాటు గ్యారంటీ ఉంటుందన్నారు. డీసీసీబీ పరిధిలో జిల్లా వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా మొండి బకాయిలు ఉన్నట్లు చెప్పారు. ఒకే కుటుంబంలో నలుగురు పేర్లతో రుణాలు తీసుకుని చెల్లించడం లేదని, అలాంటి వారు సుమారు 600 మందిని గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ బ్రాంచి మేనేజర్ కల్పన, రామలింగాపురం పీఏసీఎస్ అధ్యక్షుడు ఇప్పిలి సురేష్, మహంతి వేణు పాల్గొన్నారు.
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం
మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం


