ప్రారంభమైన నాటిక పోటీలు
విజయనగరం టౌన్: గురజాడ కళాభారతి వేదికగా తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు గురువారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అభినయ నాటకశాల, నటరత్న నాటక పరిషత్ సంయుక్త నిర్వహణలో మూడురోజుల పాటు నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణా రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులతో విజయనగరం గురజాడ కళాభారతి వేదిక కళాత్మకతను సంతరించుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి చైతన్య కళాస్రవంతి వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు, దర్శకుడు పి.బాలాజీనాయక్ స్వీయపర్యవేక్షణలో ప్రదర్శించిన ‘అసత్యం’ నాటిక ఆద్యంతం ఆహూతులను అలరించింది. దైవత్వమైనా, రాక్షసత్వమైనా, స్వార్ధమైనా, పరమార్ధమైనా అది మనిషి హృద యంలో ఉంటుందని, ప్రతి సత్యం, అసత్యం వెనుక మనిషి స్వార్థమో, భయమో ఉండి కీడో, మేలో చేస్తుందని, యదార్థమైనా సరే ఒక చెడుకు దోహదపడితే అది అసత్యమనే నాటిక సారాంశా న్ని నటీనటులు తమ ప్రదర్శనతో కళ్లకు కట్టారు. అనంతరం గెద్ద వరప్రసాద్ దర్శకత్వంలో నాగే శ్వరరావు రచనలో విజయనగరం నాటకశాల సభ్యులు ప్రదర్శించిన ‘సూత్రం’నాటిక ఆద్యంతం ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముందు శ్రీ నటరాజ నృత్యకళామందిర్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన ఆద్యంతం అలరించింది. సంస్థ అధ్యక్షులు అభియన శ్రీనివాస్ స్వీయపర్యవేక్షణలో నిర్వహించిన నాటిక పోటీల్లో ఐవీపీ రాజు, బీశెట్టి బాబ్జి, నరసింగరావు, చల్లా రాంబాబు, కిశోర్, రామకృష్ణ, విష్ణు పాల్గొన్నారు.
నిధులు వస్తేనే
ఆయుధ డిపో పనులు
బొబ్బిలి: కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే బాడంగిలోని నేవీ ఆయుధ డిపో పనులు ముందుకు సాగుతాయని ఆర్డీఓ జేవీవీఎస్ రామ మోహనరావు అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. బాడంగి మండలంలోని ముగడ, కోడూరు, రామచంద్రపురం, పాల్తేరు, పూడివలస గ్రామాల్లోని భూములను ఆయుధ డిపోకోసం గుర్తించామని, వాటి విలువ ఆధారంగా రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. రైతుల అభిప్రాయాలు, నేవీ అధికారులు, కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఆయుధ డిపోకు అప్పట్లో రూ.500 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుత భూముల ధరలకు అనుగుణంగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది.


