వైద్యకళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● దీనికి నిరసనగా కదం తొక్కాలి
● శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు పూనుకోవడం దుర్మార్గమని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. దీనికి వ్యతిరేకంగా కదంతొక్కాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. గరివిడిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. వైద్యకళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఈ నెల 11న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రం సమర్పిస్తామన్నారు. మోంథా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతుల వివరాలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. కేవలం 30 శాతం పైబడి నష్టం జరిగిన వరి పంటను మాత్రమే పరిహారం కోసం లెక్కిస్తున్నట్టు నాయకులు తెలిపారు. బొప్పాయి రైతులను ఆదుకునే చర్యలు లేవన్నారు. పింఛన్ల మంజూరు, గ్రామాల అభివృద్ధి పనులపై ఆరా తీశారు. కార్యక్రమంలో విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, అంబల్ల శ్రీరాములు, పార్టీ నాయకులు మీసాల విశ్వేశ్వరరావు, కొణిశ కృష్ణంనాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనువాసులనాయుడు, మీసాల వరహాలనాయుడు, సీర అప్పలనాయుడు, పొట్నూరు సన్యాసినాయుడు, తాడ్డి వేణు, కోట్ల విశ్వేశ్వరరావు, సర్పంచ్‌లు, ఎంపీటీ సభ్యులు పాల్గొన్నారు.


