విద్యార్థులను పరామర్శించిన డీడీ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను పరామర్శించిన డీడీ

Oct 19 2025 6:05 AM | Updated on Oct 19 2025 6:05 AM

విద్య

విద్యార్థులను పరామర్శించిన డీడీ

సాలూరు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశ్రమ, గురుకుల పాఠశాలల విద్యార్థులను ఐటీడీఏ డీడీ విజయశాంతి, ఏటీడబ్ల్యూవో కృష్ణవేణి వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ, సాలూరు మండలం మామిడిపల్లి, మక్కువ మండలం ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులపై మరణాలకు సంబంధించి ఆ పాఠశాలల హెచ్‌ఎమ్‌ సీతారాం, పుష్పనాధం, మామిడిపల్లి వార్డెన్‌ విజయలను సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. పాఠశాలల్లో సీనియర్‌ ఉపాధ్యాయులకు ఆ బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు. అనంతరం ఐటీడీఏ డీడీ విజయశాంతి పట్టణంలో బంగారమ్మ కాలనీలో ఉన్న బాలికల వసతిగృహాన్ని పరిశీలించారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : జేసీ

పార్వతీపురం రూరల్‌: స్వచ్ఛ పార్వతీపురం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పరిసరాల పరిశుభ్రతతో పాటు మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈ నెల స్వచ్ఛమైన గాలి నినాదంలో భాగంగా జాయింట్‌ కలెక్టర్‌తో పాటు డీఆర్‌వో కె.హేమలత, రెవెన్యూ సిబ్బందితో కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి మొక్కల వల్లే సాధ్యం, ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలు నాటాలని కోరారు. వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజా రవాణా వినియోగించాలని, సోలార్‌ విద్యుత్‌ వాడకాన్ని పెంచాలని సూచించారు. నిత్యం కొంత సమయం పరిశుభ్రతకు కేటాయించి, దానిని అలవాటుగా మార్చుకున్నప్పుడే స్వచ్ఛ పార్వతీపురం రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులతో స్వచ్ఛతపై జేసీ ప్రతిజ్ఞ చేయించారు.

నేడు జూనియర్స్‌ తైక్వాండో క్రీడాకారుల ఎంపికలు

విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న జూనియర్స్‌, క్యాడెట్‌ తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాల, బాలికల జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 19న ఆదివారం నిర్వహించనున్నట్టు జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ అధ్యక్షుడు డివి.చారిప్రసాద్‌ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 24, 25 తేదీల్లో విజయనగరం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రం, గ్రేడింగ్‌ సర్టిఫికెట్లు వెంట తీసుకురావాలని సూచించారు. వివరాలకు 7793950599 నంబరును సంప్రదించాలని కోరారు.

నేడు పైడితల్లి అమ్మవారి

కలశజ్యోతుల ఊరేగింపు

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లును పూర్తి చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శిరీష శనివారం తెలిపారు. స్థానిక రైల్వేస్టేషన్‌ వద్దనున్న వనంగుడిలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహానికి స్తపన కార్యక్రమాన్ని నిర్వహించి, వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో విశిష్ట పూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పైడితల్లి అమ్మవారి దీక్షాపరులతో కలశ జ్యోతులు పట్టుకుని ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు వనంగుడి నుంచి బయలుదేరుతుందని, దీక్షాపరులు కలశజ్యోతులు చేతపట్టుకుని జై పైడిమాంబ నినాదాలతో గాడీఖానా, వైఎస్‌ఆర్‌ సర్కిల్‌, ఎన్‌సీఎస్‌ థియేటర్‌ రోడ్డు, కన్యకపరమేశ్వరీ ఆలయం, గంటస్తంభం మీదుగా చదురుగుడికి చేరుకుని అక్కడ అమ్మవారికి జ్యోతులు సమర్పిస్తారని తెలిపారు. అనంతరం చదురుగుడి వద్ద భారీ ఎత్తున మెట్ల పూజను దీక్షాపరుల ఆదిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించన్నుట్టు పేర్కొన్నారు. భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు.

విద్యార్థులను పరామర్శించిన డీడీ 1
1/1

విద్యార్థులను పరామర్శించిన డీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement