
న్యాయం కోసం.. ఆత్మహత్యా యత్నం..
● తాకట్టు బంగారం కోసం జ్యువెలరీ షాపు వద్ద కుటుంబం నిరసన
● పెట్రోల్ డబ్బాతో బాధితుడి హల్‌చల్
పార్వతీపురం రూరల్: తాకట్టు పెట్టిన బంగారం తిరిగివ్వాలని కోరుతూ ఓ కుటుంబం బంగారం దుకాణం వద్ద ఆందోళనకు దిగిన ఘటన పట్టణంలో శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం కోసం ఏళ్ల తరబడి తిరుగుతున్నా ఫలితం లేకపోవడంతో, బాధితుడు ఏకంగా పురుగుల మందు తాగి, పెట్రోల్‌తో అఘాయిత్యానికి యత్నించడం కలకలం రేపింది. బాధితుడు కోట విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని రామాపురం కాలనీకి చెందిన ఆయన, 2019లో తన అవసరాల నిమిత్తం శ్రీస్వామి జ్యువెలరీ యజమాని గెంబలి శంకరరావు వద్ద 30 తులాల బంగారం తాకట్టు పెట్టారు. కొన్నాళ్లకు శంకర్రావు కరోనాతో మరణించగా, ఆయన కుమారులు పృథ్వీ, విజయ్ కుమార్‌లను సంప్రదించినట్టు బాధితుడు విజయ్ తెలిపారు. అప్పటి నుంచి రెండేళ్లుగా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటూ వారు కాలయాపన చేస్తున్నారని బాధితుడు వాపోయాడు. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా, 15 తులాలకు లెక్క తేల్చాలని చూశారని, ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కడా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన విజయ్, చివరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే, కేసు నమోదు చేసిన పోలీసులు సైతం చేతులు దులుపుకొన్నారని, తమకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని బాధితుడు ఆరోపించాడు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో శనివారం నేరుగా జ్యువెలర్ షాపు వద్దకు చేరుకున్నాడు. షాపులోకి వెళ్లి పురుగుల మందు తాగేందుకు, పెట్రోల్‌తో ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు శ్రీదేవి, సాయిరూప అడ్డుకున్నారు. అనంతరం షాపు గేట్లు మూసివేసి నడిరోడ్డుపై బైఠాయించడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ జగదీష్‌నాయుడు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా బాధితులు వెనక్కి తగ్గలేదు. అనంతరం సీఐ మురళీధర్ సైతం అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించినప్పటికీ, బాధితుల ఆందోళన మాత్రం చల్లారలేదు. పోలీసుల జోక్యం చేసుకున్నప్పటికీ ఈ వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. శనివారం సాయంత్రం పట్టణానికి చెందిన ఓ తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగినట్టు బాధితులు వాపోయారు. సోమవారం నాటికి చెల్లింపులు జరిపేలా సయోధ్య కుదిరిందని బాధితులు తెలపడంతో ఆందోళన విరమించారు. చట్టపరంగా, పోలీస్‌స్టేషన్ ద్వారా తేలాల్సిన వివాదం, చివరకు రాజకీయ నాయకుడి పంచాయతీతో తాత్కాలికంగా రాజీ అయినట్టు బాధితుల తెలిపిన వివరాల మేరకు స్పష్టమైంది