
ఎస్‌ఐ న్యాయం చేయడం లేదు...
చీపురుపల్లి: తమ కుమారుడిని యజమానే హత్య చేశాడని, ఆయనకు గతంలోనూ నేర చరిత్ర ఉందని పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం పట్టించుకోవడం లేదని మండలంలోని పత్తికాయవలసకు చెందిన మృతుడు యలకల రాము తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన మృతుని తల్లిదండ్రులు యలకల రమేష్, సింహాచలం, చెల్లి రమ, మేనమామలు ముగిది పైడితల్లి, ముగిది గొల్ల, మేనత్తలు ముగిది సత్యవతి, రాధ మాట్లాడారు. కొడుకును పోగొట్టుకుని ఉన్న తమకు న్యాయం జరగడం లేదన్నారు. తమ కుమారుడు రామును సంబంధిత యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్‌ఐ పట్టించుకోవడం లేదన్నారు. ఎస్‌ఐకు జేసీబీ యజమాని వండాన సన్యాసికి బంధుత్వం ఉండడంతోనే హత్య కేసును నీరుగార్చే కుట్ర పన్నుతున్నారనే భయం కలుగుతోందన్నారు. అందుకనే తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఐదారు రోజులు క్రితమే తమ కుమారుడును జేసీబీ యజమాని వండాన సన్యాసి హత్య చేశాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. ఇంతవరకు కనీసం గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించలేదని పేర్కొన్నారు. అందుకే తమకు న్యాయం జరగదని భయం పెరిగిందన్నారు. కూలి పనులు చేసుకునే తమకు ఎలాంటి అండదండలు లేవని పోలీసులు కూడా న్యాయం చేయకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. జేసీబీ యజమాని సన్యాసి మొబైల్‌లో అక్టోబర్ 7 నుంచి 12 వరకు కాల్ లిస్ట్ వెల్లడించాలని పోలీసులను కోరామన్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
హత్య చేశాడని ఫిర్యాదు చేసినా విచారణ చేపట్టలేదు..
జేసీబీ యజమానికి ఎస్‌ఐకు బంధుత్వం ఉండడమే కారణం
మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆవేదన