
చెప్పుకోలేను.. విప్పుకోలేను..
పీఏ పోరు పడలేక..
● అందుకే విజయనగరం నుంచి వెళ్లిపోతా...?
● మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య ఆవేదన
చందాల
వసూళ్లలోనూ ఒత్తిడి
సాక్షిప్రతినిధి, విజయనగరం:
టీడీపీ నాయకులకు సొంత తెలివితేటలు లేవు.. చెబుదామంటే అర్థం చేసుకునే ఓపిక లేదు.. నా కష్టాలు బయటకు చెప్పుకోలేను.. లోలోపల దాచుకోలేను.. ఎందుకొచ్చిన బాధ.. సంచిసర్దుకుని వేరే ఊరు వెళ్లిపోతాను అంటూ మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య లోలోన కుమిలిపోతున్నారట. వాస్తవానికి విజయనగరం మున్సిపల్ కౌన్సిల్‌లో తెలుగుదేశానికి అసలు బలమే లేదు. మేయర్... డిప్యూటీ మేయర్, ఇంకో డిప్యూటీ మేయర్... స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్ వంటి అన్ని పదవుల్లోను వైఎస్సార్‌సీపీ నాయకులే ఉన్నారు. నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా.. ఖర్చుతో కూడిన ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఈ విషయంలో కౌన్సిల్ నిర్ణయమే అంతిమం. కౌన్సిల్‌లో తెలుగుదేశానికి పూర్తిగా బలం లేకపోవడంతో కేవలం ఎమ్మెల్యే పదవి మాత్రమే ఉన్న టీడీపీ ఆ ఒక్క పదవి పేరు చెప్పి అడ్డదిడ్డమైన నిర్ణయాలకు కమిషనర్ మీద ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఆయన మేనేజ్ చేయలేక అసలు విషయం అర్థం అయ్యేలా చెప్పలేక సతమతమై బదిలీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతోపాటు ఆమె పీఏ కూడా అలవిమాలిన పెత్తనం చేస్తూ ఒత్తిడి తెస్తుండడంతో వారు చెప్పిన పనులు చేయలేక కౌన్సిల్‌లో వాటిని నెగ్గించలేక కమిషనర్ నల్లనయ్య ఇరకాటంలో పడిపోతున్నట్టు తెలిసింది. కౌన్సిల్‌లో తీర్మానం లేకుండా ఏ ఒక్క పని కూడా చేయడం సాధ్యం కాదన్నది అందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవి తమది కాబట్టి కౌన్సిల్ నిర్ణయాలను పక్కనపెట్టి మౌఖికంగా చెప్పే ఆదేశాల పాటించాలంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడిని ఆయన భరించలేకపోతున్నారు. ఇటు వైఎస్సార్‌సీపీ అటు టీడీపీ మధ్య నలిగిపోయి ఇబ్బంది పడడం కంటే వెళ్లిపోవడం మేలని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఇదే విషయం టీడీపీ పెద్దల వద్ద ప్రస్తావించగా.. ఉంటే ఉండండి పోతే పొండి అన్నట్లుగా మాట్లాడారని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి.
కమిషనర్ మనస్తాపానికి ఇవేనా కారణం?
ఇటీవల కాలంలో నగరంలో పలు రోడ్ల విస్తరణలో ఇల్లు, షాపులు కోల్పోయిన వారికి ప్రభుత్వం టీడీఆర్ లు ఇస్తుంది. ఆ సర్టిఫికెట్లను సదరు జాగాలు కోల్పోయిన వాళ్లు బయట ఎవరికై నా విక్రయించి తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఉదాహరణకు రోడ్డు విస్తరణలో 50 గజాలు కోల్పోయిన వారికి రెట్టింపు పరిహారం ఇస్తారు. అంటే వంద గజాల స్థలం కోల్పోయినట్లు సర్టిఫికెట్ ఇస్తారు. దానిని సదరు బాధితులు వేరే బిల్డర్లకు విక్రయించుకుని తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. అయితే, ఇదే క్రమంలో రోడ్డు విస్తరణలో సింహాచలం మేడ, లోయర్ ట్యాంక్ బండ్, కోట వద్ద మాన్సాస్ సంస్థ స్థలాలు కొంతమేర కోల్పోగా వీటికి టీడీఆర్ ఇచ్చే విషయంలో కమిషనర్‌తో పేచీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఆయనను బాగా ఇబ్బంది కలిగించినట్టు సమాచారం
పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి కమిషనర్ జోక్యం చేసుకొని రూ.15 లక్షలకు పైగా వసూలు చేసి ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారులు.. మున్సిపల్ హెల్త్.. ఎన్విరాన్మెంట్ విభాగం వారితో ఒత్తిడి చేయించి మరీ డబ్బులు వసూలు చేశారు. ఈ అంశంలోనూ కమిషనర్ బాగా ఇబ్బంది పడినట్టు తెలిసింది. ఇలాంటి పలు పరిణామాలు కమిషనర్‌ను ఇక్కడి నుంచి బదిలీ వైపు పురిగొల్పుతున్నాయన్న చర్చ సాగుతోంది.