
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
● శాసన మండలి విపక్ష నేత
బొత్స సత్యనారాయణ
విజయనగరం: విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల హక్కు అని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమం ప్రారంభమై 59 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంబేడ్కర్ రైట్స్ ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను విజయనగరంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, దళిత సామాజికవర్గానికి చెందిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే తమనంపల్లి అమృతరావు స్ఫూర్తిని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కొనసాగిస్తూ ప్రైవేటీకరణను విరమించుకోవాలని హితవుపలికారు. 2025 ఆగస్టు 16న విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని 32 విభాగాలను ప్రైవేటీకరణకు టెండర్లు పిలవడం, అదే రోజున ప్యాకేజీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. 32 మంది ప్రాణత్యాగంతో సాకారమై, నేడు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు.
ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని నేడు ప్రైవేటీకరణకు పాటుపాడడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రైట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బి.భానుమూర్తి, ప్రతినిధులు పిడకల ప్రభాకరరావు, ధారాన వెంకటేష్, డోల కోటేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, జామి కృష్ణ, చంద ఉమామహేశ్వరరావు, వంక చిన్నికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.